జూన్ 4న జరిగిన RCB విజయోత్సవ వేడుక సందర్భంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట జరిగి 11 మంది అభిమానులు మృతి చెందారు. ఈ విషాద ఘటన తర్వాత చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌ల నిర్వహణను నిలిపివేశారు. మ్యాచ్ లను నగరం మధ్యలో నిర్వహించకూడదని పెద్ద ఎత్తున డిమాండ్స్ వినిపించాయి.
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో క్రికెట్ మ్యాచ్‌ల నిర్వహణకు కర్ణాటక ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అవసరమైన అన్ని భద్రతా చర్యలు తీసుకున్న తర్వాతే మ్యాచ్‌లకు అనుమతి ఇస్తున్నట్లు డిప్యూటీ సీఎం, బెంగళూరు అభివృద్ధి శాఖ మంత్రి డీకే శివకుమార్ తెలిపారు.
బెంగళూరు నగరం ప్రతిష్ఠను కాపాడటానికే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తామని శివకుమార్ తెలిపారు. భద్రతా ఏర్పాట్లను హోంమంత్రి జి. పరమేశ్వర పర్యవేక్షిస్తారని, కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (KSCA) అధ్యక్షుడు వెంకటేశ్ ప్రసాద్, పోలీసు అధికారులతో చర్చించి తుది ప్రణాళికను సిద్ధం చేస్తారని వివరించారు.