పాట్నాలో రేపు సీడబ్ల్యూసీ సమావేశం, బిహార్ అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్
బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో విస్తృత సీడబ్ల్యూసీ సమావేశం రేపు పాట్నాలో జరగనుంది.
By - Knakam Karthik |
ఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో విస్తృత సీడబ్ల్యూసీ సమావేశం రేపు పాట్నాలో జరగనుంది. ఈ మేరకు పీసీసీ కార్యాలయంలో రేపు ఉదయం 10 గంటల నుంచి విస్తృత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. బిహార్ ఎన్నికలు, ఓట్ల చోరీ, సంస్థాగత సంస్కరణలు అజెండాగా చర్చలు, కీలక నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీ తీసుకోనుంది. కాగా ఈ మీటింగ్‌కు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు, కర్నాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులు, అన్ని రాష్ట్రాల పిసిసి అధ్యక్షులు, సి.ఎల్.పి లీడర్లు (శాసన సభ, శాసన మండలి పక్ష నేతలు), సి.ఈ.సి సభ్యులు హాజరుకానున్నారు. ఏపి నుంచి పిసిసి అధ్యక్షురాలు షర్మిలా, రఘువీరా రెడ్డి, పల్లంరాజు, గిడుగు రుద్రరాజు, కొప్పుల రాజు..తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, దామోదర్ రాజనర్సింహ, వంశీ చందర్ రెడ్డి, ఉత్తమ కుమార్ రెడ్డి హాజరు కానున్నారు.
కాగా ఈ సమావేశంలో సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించిన కాంగ్రెస్ అధిష్ఠానం, పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీహార్ పార్టీ నేతల్లో, శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం నెలకొల్పే లక్ష్యంగా కీలక విస్తృత “సి.డబ్ల్యు.సి” సమావేశం. జరగనుంది. బీహార్‌లో పార్టీని మరింతగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ అధిష్ఠానం ఉండగా, విధానపరమైన నిర్ణయాలు తీసుకునే “కాంగ్రెస్ పార్టీ అత్యంత ఉన్నతస్థాయి నిర్ణాయక సంఘం” “సి.డబ్ల్యు.సి” పాట్నాలో సమావేశమై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.
ఆగస్టు 17 నుంచి 15 రోజులపాటు, బీహార్ లోని 25 జిల్లాల్లో రాహుల్ గాంధీ నిర్వహించిన “ఓటర్ అధికార యాత్ర” విజయవంతం కావడంతో పార్టీ నేతల్లో, శ్రేణుల్లో ఉత్సాహం రావడంతో, బీహార్‌లో పోగొట్టుకున్న పూర్వ వైభవం పునఃప్రతిష్ఠించాలనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఉంది. ఏప్రిల్ 17 న పాట్నాలో జరిగిన సమావేశంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం “ఇండియా” కూటమి సమన్వయ కర్తగా “రాష్ట్రీయ జనతా దళ్” (ఆర్.జే.డి) నేత తేజస్వీ ప్రసాద్ యాదవ్ నియామకం జరిగింది. అయితే బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార బాధ్యతలు ఆర్.జే.డి నేత తేజస్వీ ప్రసాద్ యాదవ్ కు అప్పగిస్తే, కాంగ్రెస్ పార్టీ కి ఇంక మిగిలిందేముందన్న రాష్ట్ర నేతల పెదవి విరుపులతో అధిష్టానం అలర్ట్ అయింది. దీంతో బీహార్ కాంగ్రెస్ పార్టీ నేతల, శ్రేణుల అభిమతాన్ని గుర్తించి, ముఖ్యమంత్రి అభ్యర్థి పై అధికారిక ప్రకటన చేయకుండా అధిష్టానం జాగ్రత్త పడింది. ఈ నేపథ్యంలోనే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో “ఇండియా” కూటమి పక్షాలు సమన్వయంతో, సంఘటితమై విజయం సాధించాలనే కృతనిశ్చయంతో పనిచేయాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రకటించారు. కాగా త్వరలో హర్యానా, తమిళనాడు, కర్నాటక, గోవాలతో సహా కొన్ని రాష్ట్రాలకు నూతన పీసీసీ అధ్యక్షులను అధిష్ఠానం నియమించనుంది.