పైకి చాక్లెట్ కవర్, లోపల రూ.54 కోట్ల విలువైన కొకైన్
చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు.
By Knakam Karthik
పైకి చాక్లెట్ కవర్, లోపల రూ.54 కోట్ల విలువైన కొకైన్
చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. ఇథియోపియా నుండి చైన్నై చేరుకున్న ఇద్దరు స్మగ్లర్స్ వద్ద కొకైన్ ఉన్నట్లుగా అధికారులకు అనుమానం వచ్చింది. కస్టమ్స్ అధికారులను బురిడీ కొట్టించడానికి కేటుగాళ్లు ఎంతో తెలివిగా కొకైన్‌ను క్యాప్సూల్స్‌లో నింపి గోల్డ్ కలర్ కవర్స్‌తో ప్యాకింగ్ చేశారు. గోల్డ్ చాక్లెట్స్ అనుకునేలా ప్యాకింగ్ చేసి FERRERO ROCHER చాక్లెట్స్ బాక్సులల్లో దాచి పెట్టి ఎయిర్ పోర్ట్ నుండి తరలించే యత్నం చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు చెన్నై ఎయిర్ పోర్ట్‌లో కస్టమ్స్, నార్కోటిక్ అధికారులు మాటు వేశారు. ఇథియోపియా నుండి చెన్నై ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయిన స్మగ్లర్ల పై అధికారులు నిఘా పెట్టారు. చాక్లెట్స్‌గా క్లెయిమ్ చేస్తూ కొకైన్ తరలిస్తున్న స్మగ్లర్స్ ఆట కట్టించి... డ్రగ్స్ వ్యవహారాన్ని గుట్టు రట్టు చేశారు. ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేసి వారి వద్ద నుండి 54 కోట్ల విలువ చేసే 5.6 కేజీల కొకైన్ సీజ్ చేశారు.
తీగ లాగితే డొంక కదినట్లు చెన్నై లో పట్టుబడిన స్మగ్లర్స్‌ను తమదైన స్టైల్‌లో నార్కోటిక్స్ అధికారులు విచారణ చేసి..కొకైన్ తరలింపు లో సంబంధం ఉన్న మరో ఇద్దరిని అరెస్టు చేశారు. ముంబైలో ఒకరు, ఢిల్లీలో మరో నైజీరియా స్మగ్లర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మొత్తం నలుగురిపై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.