త్వరలోనే నేర చట్టాల బిల్లుకు ఆమోదం: అమిత్ షా
వివిధ రకాల వ్యవస్థీకృత నేరాలు.. నేడు భారత్‌లో సవాళ్లు విసురుతున్నాయని కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు.
By అంజి Published on 27 Oct 2023 5:32 AM GMTత్వరలోనే నేర చట్టాల బిల్లుకు ఆమోదం: అమిత్ షా
వివిధ రకాల వ్యవస్థీకృత నేరాలు.. నేడు భారత్‌లో సవాళ్లు విసురుతున్నాయని కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. క్రిప్టో కరెన్సీతో దేశ ఆర్థిక వ్యవస్థ బలహీనానికి యత్నిస్తున్నారని, నకిలీ నోట్లు, హవాలా కట్టడిని మరింత పటిష్ఠం చేయాల్సి ఉందన్నారు. ట్రైనింగ్ పూర్తైన ఐపీఎస్‌లు ఈ సమస్యలు పోరాడతారనే నమ్మకం ఉందని అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలోని హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ (ఎస్‌విపిఎన్‌పిఎ)లో శుక్రవారం 75వ బ్యాచ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపిఎస్) ప్రొబేషనర్ల పాసింగ్-అవుట్ పరేడ్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడారు.
బ్రిటీష్ కాలం నాటి మూడు నేర చట్టాలు సీఆర్‌పీసీ, ఐపీసీ, ఎవిడెన్స్‌ను మార్చాల్సి ఉందని అమిత్ షా అభిప్రాయం వ్యక్తం చేశారు. మూడు చట్టాల్లో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసి.. పార్లమెంటు ముందుంచిందని గుర్తు చేశారు. త్వరలోనే నేర చట్టాలకు సంబంధించిన బిల్లు ఆమోదం పొందుతుందని అమిత్ షా అన్నారు. బ్రిటీష్ చట్టాలతో కాకుండా, భారత్ చేసిన కొత్త చట్టాలతో ముందుకు సాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. శాసనాలను సురక్షితంగా ఉంచడమే పాత చట్టాల ఉద్దేశమని.. ప్రజల అధికారాలను సురక్షితంగా ఉంచడం కొత్త చట్టాల ఉద్దేశమని వివరించారు.
సెరిమోనియల్ మార్చ్ తర్వాత హోంమంత్రి ప్రొబేషనర్లను ఉద్దేశించి ప్రసంగించారు. 155 మంది ఐపీఎస్ ఆఫీసర్ ట్రైనీలు, 20 మంది ఫారిన్ ఆఫీసర్ ట్రైనీలు సహా మొత్తం 175 మంది ఆఫీసర్ ట్రైనీలు ఈ పరేడ్‌లో పాల్గొన్నారని అకాడెమీ డైరెక్టర్ అమిత్ గార్గ్ సమావేశంలో తెలియజేశారు. 32 మంది మహిళా ఐపీఎస్ ఆఫీసర్ ట్రైనీలు సహా 155 మంది ఐపీఎస్ ఆఫీసర్ ట్రైనీలు ఉన్నారని ఆయన తెలిపారు. ఫారిన్ ఆఫీసర్ ట్రైనీలలో ఆరుగురు భూటాన్, ఐదుగురు మాల్దీవులు, ఐదుగురు నేపాల్, నలుగురు మారిషస్ పోలీసులున్నారని ఆయన తెలిపారు.