సీపీఎం నేత సీతారాం ఏచూరి కన్నుమూత‌

కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) సీనియర్ నాయకుడు, జాతీయ‌ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి గురువారం మరణించారు

By Medi Samrat  Published on  12 Sept 2024 4:16 PM IST
సీపీఎం నేత సీతారాం ఏచూరి కన్నుమూత‌

కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) సీనియర్ నాయకుడు, జాతీయ‌ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి గురువారం మరణించారు. 72 ఏళ్ల వయసులో ఆయన తుది శ్వాస విడిచారు. ఆయ‌న‌ చాలా కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతూ.. ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఏచూరి ఆగస్టు 19న ఎయిమ్స్‌లో చేరారు. అక్క‌డ ఆయ‌న‌ను వైద్యులు ఐసీయూకి తరలించారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్నారు. గురువారం ఆయన ఆరోగ్యం మరోసారి క్షీణించడంతో క‌న్నుమూశారు.

సీతారాం ఏచూరి 1952 ఆగస్టు 12న చెన్నైలో తెలుగు మాట్లాడే బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. 2016లో రాజ్యసభలో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు కూడా అందుకున్నారు. ఎమర్జెన్సీ సమయంలో జేఎన్‌యూలో ఉన్న సమయంలో ఆయ‌న‌ అరెస్టు అయ్యారు. ఆ తర్వాత వరుసగా మూడు సార్లు జెఎన్‌యు స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1984లో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీలో చేరారు. 2015లో పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు.

ఏచూరి 2005లో పశ్చిమ బెంగాల్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. సభలో పలు అంశాలను లేవనెత్తారు. గత కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యం క్షీణిస్తోంది. ఇటీవల ఏచూరికి క్యాటరాక్ట్ సర్జరీ జరిగింది. ఇప్పుడు ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌ కారణంగా ఆయన ఎయిమ్స్‌లో చేరారు. కోల్‌కతాలో జరిగిన డాక్ట‌ర్‌ ఘటనపై కూడా ఆయన తాజాగా ఓ ప్రకటన చేశారు. వామపక్ష నేతగా ఆయ‌న‌ ప్రత్యేక గుర్తింపు ఉంది. వామపక్ష భావజాలానికి సంబంధించి ఆయన ఎప్పుడూ తన స్వరాన్ని విసిపిస్తూనే వ‌చ్చారు.

Next Story