చిన్నారులకు టీకా పంపిణీపై ప్రధాని మోదీ కీలక ప్రకటన
COVID Vaccination Of Children Aged 15-18 from January 3rd.దేశంలో చిన్నారుల టీకా పంపిణీపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక
By తోట వంశీ కుమార్ Published on 26 Dec 2021 3:05 AM GMTదేశంలో చిన్నారుల టీకా పంపిణీపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. జనవరి 3వ తేదీ నుంచి 15 నుంచి 18 ఏళ్ల వయస్సు వారికి కొవిడ్ టీకా ఇవ్వనున్నట్లు చెప్పారు. శనివారం రాత్రి ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగించారు. కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో ఇంత వరకు సాధించిన పురోగతిని, ఇకపై చేపట్టబోయే చర్యల్ని ఆవిష్కరించారు. ఒమిక్రాన్ వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోందని.. అయినప్పటికి భయపడాల్సిన పని లేదన్నారు. అయితే.. అందరూ అప్రమత్తంగా ఉండాలని కరోనా జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలని సూచించారు.
ఇక 60 ఏళ్ల వయసు దాటిన వారికి, ఇతరత్రా అనారోగ్య సమస్యలు ఉన్నవారికి వైద్యుల సూచన మేరకు ఫ్రికాషన్(ముందు జాగ్రత్త) డోసు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఆరోగ్య సిబ్బందికి జనవరి 10 నుంచి దీన్ని వేయనున్నట్లు తెలిపారు. కాగా.. మూడో డోసును అందరూ బూస్టర్ డోసుగా పరిగణిస్తున్న నేపథ్యంలో మోదీ మాత్రం దానిని 'ప్రికాషన్' డోసుగా పేర్కొనడం గమనార్హం. 15 నుంచి 18 ఏళ్ల వయసు ఉన్న వారికి టీకా ఇవ్వడం ద్వారా.. కళాశాలలు, పాఠశాలలకు పిల్లలను పంపే తల్లిదండ్రులకు భరోసా వస్తుందని ప్రధాని అభిప్రాయపడ్డారు.
కరోనా పై పోరాటంలో వ్యక్తిగత స్థాయిలో అందరూ జాగ్రత్తలు తీసుకోవడమే పెద్ద ఆయుధమన్నారు. అనవసర అపోహలు వద్దని, పండుగల సమయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. ఇక ముక్కు ద్వారా తీసుకునే టీకా, ప్రపంచంలోనే తొలిసారిగా డీఎన్ఏ ఆధారిత టీకా త్వరలో మన దేశంలో అందుబాటులోకి వస్తాయన్నారు. ఈ సంవత్సరం జనవరి 16న టీకాల పంపిణీని ప్రారంభించగా ఇప్పటి వరకు 141 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణి చేసినట్లు వెల్లడించారు.
జనాభాలో 61 శాతం మంది వయోజనులకు రెండు డోసుల టీకాలు, 90 శాతం మంది వయోజనులకు ఒక డోసు టీకా అందినట్లు చెప్పారు. కాగా.. ఇప్పుడు 15 నుంచి 18 ఏళ్ల వయసు ఉన్నవారికి టీకాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. దీని వల్ల పాఠశాల్లో బోధన తిరిగి పూర్వస్థితికి వస్తుందన్నారు. కరోనా మహమ్మారిపై పోరులో ఆరోగ్య సిబ్బంది అందిస్తున్న సేవలపై ప్రధాని ప్రశంసలు కురిపించారు.