దేశప్రజలంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నా కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి కేంద్ర ప్రభుత్వం సిద్దమైంది. జనవరి 16 నుంచి టీకా పంపిణీ చేపట్టనున్నట్లు శనివారం అధికారికంగా వెల్లడించింది. ప్రాధాన్యత క్రమంలో టీకా ఇవ్వనున్నట్లు పేర్కొంది. తొలిదశలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలోని ఆరోగ్య సంరక్షణ కార్మికులకు, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు టీకా ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా 3 కోట్ల మందికి వ్యాక్సిన్ అందించనున్నారు. ఆ తరువాత 50ఏళ్లకు పైబడిన వారికి లేదా ఇతర వ్యాధులతో బాధపడుతున్న 50ఏళ్ల లోపు వారికి అందజేయనున్నట్లు తెలిపింది. వీరి సంఖ్య 27 కోట్లుగా ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
దేశంలో కరోనా పరిస్థితులు, వ్యాక్సిన్ పంపిణీ పై ఉన్నతాధికారులతో ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష జరిపిన అనంతరం కేంద్రం ఈ ప్రకటన చేసింది. వచ్చే వారంలో మకర సంక్రాంతి, లోహ్రి, మగ్ బిహు తదితర పండుగలను దృష్టిలో పెట్టుకుని జనవరి 16 నుంచి టీకా పంపిణీ ప్రారంభించాలని నిర్ణయినట్లు అందులో పేర్కొంది. సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహించగా.. కేబినేట్ సెక్రటరీ, పీఎం ప్రధాన కార్యదర్శి, ఆరోగ్యశాఖ కార్యదర్శి, ఇతర సీనియర్ అధికారులతో మోదీ సమావేశం నిర్వహించారు. కోవిడ్ వ్యాక్సినేషన్‌కు సంబంధించి విస్తృత ఏర్పాట్లు చేయాలని కేంద్ర కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌభ అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు ఆదేశాలిచ్చారు.
ఇటీవల కేంద్రం రెండు స్వదేశీ టీకాలకు అత్యవసర వినియోగానికి అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే. అందులో ఒకటి భారత్ బయోటెక్ అభివృద్ది చేసిన కొవాగ్జిన్ కాగా రెండోది ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా సౌజన్యంతో సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన కొవిషీల్డ్ టీకాలకు కేంద్రం ఆమోదముద్ర వేసింది.