కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో టాప్-10లో నిలిచిన భారత్

Covid 19 vaccination. వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో భారత్ తొలి పది దేశాల సరసన నిలిచింది. ప్రజలకు అత్యధిక వ్యాక్సిన్‌ డోసులను వేసి, అంతర్జాతీయ రికార్డు సృష్టించింది.

By Medi Samrat  Published on  25 Jan 2021 12:34 PM GMT
Covid 19 vaccination.

కరోనా‌ మహమ్మారిని తరిమికట్టడంలో భారత్‌ తన ప్రయత్నాలను మొదలుపెట్టింది.‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో మనదేశం తొలి పది దేశాల సరసన నిలిచింది. ప్రజలకు అత్యధిక వ్యాక్సిన్‌ డోసులను వేసి, అంతర్జాతీయ రికార్డు సృష్టించింది. వ్యాక్సిన్‌ ఆవిష్కరించిన తొలివారం రోజుల్లోనే కోవిడ్‌–19 వ్యాప్తని అడ్డుకునేందుకు 12 లక్షల మంది ఆరోగ్యకార్యకర్తలకు వ్యాక్సినేషన్‌ వేశారు.

భారత్‌లో జనవరి 16న తొలుత ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభించారు. ఇప్పటి వరకు 12 లక్షలకుపైగా వ్యాక్సిన్‌ డోసులను ఇచ్చారు. ఈ లెక్కన సరాసరి రోజుకి 1.8 లక్షల వ్యాక్సిన్‌ డోసులను ఇచ్చారు. తొలి రోజు 2 లక్షలకుపైగా వ్యాక్సిన్‌ డోసులను ఇచ్చారు.

ప్రభుత్వం తొలుత 1.1 కోట్ల కోవిషీల్డ్‌ డోసులను, 0.55 కోట్ల కోవాగ్జిన్‌ డోసులను కొనుగోలు చేసింది. తొలి దశలో ఆగస్టు 2021 నాటికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ దేశంలోని 30 కోట్ల మందికి వ్యాక్సినేషన్‌ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ముందుగా ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌తో సహా ఒక కోటి మంది ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సినేషన్‌ వేయాలని భావించింది. రెండో దశలో 50 ఏళ్ళు దాటిన 27 కోట్ల మందికి వ్యాక్సినేషన్‌ ఇస్తారు.

ప్రపంచంలోనే భారత దేశం కరోనా ఇన్‌ఫెక్షన్‌ సోకిన దేశాల్లో ద్వితీయ స్థానంలో ఉంది. ప్రస్తుతం మన దేశంలో తాజాగా నమోదౌతున్న కోవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. జనవరి 22 వరకు గతవారంలో భారతదేశంలో రోజుకి 14,000 కొత్త కరోనా కేసులు నమోదౌతూ వచ్చాయి. నేపాల్, బాంగ్లాదేశ్, బ్రెజిల్, మొరాకోలతో సహా అనేక ఇతర దేశాలకు సైతం కోవిడ్‌ వ్యాక్సిన్‌ని సరఫరా చేయడంలో భారత్‌ ముందుంది.






Next Story