దేశంలో కరోనా టెన్షన్..కేరళలోనే 273 కేసులు
దేశవ్యాప్తంగా మరోసారి కోవిడ్-19 కేసులు పెరుగుతున్నాయి.
By Knakam Karthik
దేశంలో కరోనా టెన్షన్..కేరళలోనే 273 కేసులు
దేశంలో మళ్లీ మహమ్మారి కరోనా వైరస్ పంజా విసురుతోంది. దేశవ్యాప్తంగా మరోసారి కోవిడ్-19 కేసులు పెరుగుతున్నాయి. దేశంలో ప్రస్తుతం 270కి పైగా యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఢిల్లీ, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే దేశ రాజధాని ఢిల్లీలో 23 కేసులు నమోదు కాగా.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ కరోనా కలవరం మొదలైంది. నమోదవుతున్న కేసులు టెన్షన్ పుట్టిస్తున్నాయి.
దీంతో ఆయా రాష్ట్రాలు ఆసుపత్రులను అప్రమత్తం చేశాయి. తగినన్ని ఆక్సిజన్ సిలిండర్లు, వ్యాక్సిన్లు, బెడ్లు, టెస్ట్ కిట్లను అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించాయి. దేశంలోనే కేరళ రాష్ట్రంలో కరోనా కేసుల పెరుగుదల అత్యధికంగా ఉంది. దీంతో ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ అన్ని జిల్లాల అధికారులను అప్రమత్తం చేశారు. రద్దీ ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల్లో మాస్క్‌లను తప్పనిసరి చేశారు. దగ్గు, జలుబు వంటి లక్షణాలు ఉంటే ముఖానికి మాస్క్ ధరించాలన్నారు.
దక్షిణాసియాలో కోవిడ్ కేసుల పెరుగుదలకు JN.1 వేరియంట్ (ఓమిక్రాన్ యొక్క ఉప-వేరియంట్) వ్యాప్తి కారణమై ఉండవచ్చు. ఈ వేరియంట్ చాలా "యాక్టివ్" గా ఉన్నప్పటికీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) దీనిని ఇంకా "ఆందోళన కలిగించే వేరియంట్" గా వర్గీకరించలేదని నిపుణులు తెలిపారు. లక్షణాలు సాధారణంగా తేలికపాటివి మరియు సోకిన వారు నాలుగు రోజుల్లో కోలుకుంటారు. కొన్ని సాధారణ లక్షణాలు జ్వరం, ముక్కు కారటం, గొంతు నొప్పి, తలనొప్పి, అలసట.