కొవాగ్జిన్‌ ఎమర్జెన్సీ వినియోగానికి డబ్ల్యూహెచ్‌వో అనుమతి..!

Covaxin gets world health organization approval. కరోనా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు భారత దేశ ఫార్మా కంపెనీ భారత్‌ బయోటెక్‌ కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ను తయారు చేసింది.

By అంజి  Published on  3 Nov 2021 6:41 PM IST
కొవాగ్జిన్‌ ఎమర్జెన్సీ వినియోగానికి డబ్ల్యూహెచ్‌వో అనుమతి..!

కరోనా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు భారత దేశ ఫార్మా కంపెనీ భారత్‌ బయోటెక్‌ కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ను తయారు చేసింది. ఈ వ్యాక్సిన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి ఇచ్చింది. ఈ వ్యాక్సిన్‌ను ఎమర్జెన్సీ యూజ్‌ ఆఫ్‌ లిస్టింగ్‌లో చేర్చేందుకు డబ్ల్యూహెచ్‌వో ఆమోదం తెలుపుతూ ట్వీట్‌ చేసింది. డబ్ల్యూహెచ్‌వో ఇచ్చిన ఈ గుర్తింపుతో ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్‌ ఇచ్చే వీలు కలుగుతుంది. అలాగే వ్యాక్సిన్‌ తీసుకున్న వారు విదేశాలకు వెళ్లినప్పుడు.. అక్కడి ప్రభుత్వాలు విధించే ఆంక్షల్లోగాని, ఐసోలేషన్‌లో గానీ ఉండాల్సిన పని ఉండదు. ఏప్రిల్‌ 19వ తేదీన భారత బయోటెక్‌ కంపెనీ.. కొవాగ్జిన్‌ను అత్యవసర వినియోగ జాబితాలో చేర్చాలని కోరింది. దీనిపై పలు మార్లు నిపుణుల కమిటీ సమావేశం అయ్యింది.

వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ డేటా, భద్రత, ఇమ్యూనిటీ, సామర్థ్యంతో పాటు పలు అంశాలపై డబ్ల్యూహెచ్‌వో సాంకేతిక బృందం సమీక్ష చేసింది. ఇప్పుడు తాజాగా కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ వినియోగానికి అనుమతి ఇచ్చింది. భారతదేశంలో కొవాగ్జిన్ వ్యాక్సిన్‌ను వినియోగిస్తున్నారు. కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ రెండు డోసుల్లో తీసుకోవాల్సి ఉంటుంది. ఇది కరోనాతో పాటు పలు వేరియంట్ల నుండి రక్షణ కల్పిస్తుంది. కరోనా నియంత్రణ కోసం భారత్‌ బయోటెక్‌ సంస్థ మొదటి నుంచి చొరవ చూపుతోంది. ఇది వరకూ కూడా పలు వ్యాధులకు భారత్‌ బయోటెక్‌ వ్యాక్సిన్లు తయారు చేసింది. ఆ అనుభవంతోనే ఇప్పుడు కొవాగ్జిన్‌ను తయారు చేసింది. ప్రమాణాల విషయంలో ఏ మాత్రం రాజీపడకుండా వ్యాక్సిన్‌ను రూపొందించింది. ఈ వ్యాక్సిన్‌ కరోనా నుంచి 77.8 శాతం రక్షణ, డెల్టా వేరియంట్‌ నుంచి 65.2 శాతం రక్షణ కల్పిస్తోందని పలువురు నిపుణులు చెప్పారు.

Next Story