2011లో సంచలనం సృష్టించిన సౌమ్య హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న దోషి గోవిందచామి శుక్రవారం ఉదయం అత్యంత భద్రత కలిగిన కన్నూర్ సెంట్రల్ జైలు నుంచి తప్పించుకుని పారిపోయాడు. కొన్ని గంటల తర్వాత పోలీసులు అతన్ని పట్టుకున్నారు.
కన్నూర్ నగర పరిధిలోని తలప్ వద్ద ఒక శిథిలావస్థలో ఉన్న భవనం దగ్గర నిందితుడిని పట్టుకున్నట్లు టీవీ ఛానెళ్లలో దృశ్యాలు కనిపిస్తున్నాయి. వార్తల నివేదికల ప్రకారం, అతను భవనం సమీపంలోని బావిలో దాక్కున్నాడు.
2011, ఫిబ్రవరి 1వ తేదీన కొచ్చి నుంచి షోరణూర్ వెళ్తున్న రైలులో సౌమ్య(23) ఒంటరిగా ప్రయాణిస్తోంది. అది గమనించిన గోవిందచామీ.. ఆమెను రైలు నుంచి తోసేశాడు. ట్రాక్ పక్కన అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి ఆమెపై బలాత్కారం చేశాడు. ఆమె ఫోన్‌తో పారిపోగా, ఆ మరుసటిరోజే నిందితుడ్ని అరెస్ట్ చేశారు. త్రిసూర్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతూ సౌమ్య ఫిబ్రవరి 6వ తేదీన కన్నుమూసింది.
ఈ ఘటన కేరళతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అదే ఏడాది నవంబర్ 11న ఫాస్ట్‌ట్రాక్ కోర్టు గోవిందచామికి మరణశిక్ష విధించింది. కోర్టు నుంచి బయటకు వస్తున్న టైంలో అతడు నవ్వుతూ కనిపించాడు. 2013లో కేరళ హైకోర్టు ఆ శిక్షను నిలుపుదల చేయగా, 2014లో సుప్రీం కోర్టు సైతం స్టే ఇచ్చింది. 2016లో గోవిందచామీపై మర్డర్ అభియోగాన్ని తొలగించి, కేవలం రేప్‌కేసు కింద జీవిత ఖైదును సుప్రీం కోర్టు విధించింది.
కన్నూరు జైలులో ప్రస్తుతం జీవిత ఖైదు అనుభవిస్తున్న గోవిందచామి. గత అర్ధరాత్రి సమయంలో జైలు నుంచి పరారయ్యాడు. తాను ఉంటున్న సెల్ ఊచలను తొలగించి బయటకు వచ్చాడు. తోటి ఖైదీల దుస్తులను తాడుగా మార్చేసి కరెంట్ ఫెన్సింగ్‌ను దాటేసి మరీ పరారయ్యాడు. గోడ దూకాక రోడ్డు మీద తాపీగా నడుచుకుంటున్న దృశ్యాలు అక్కడి సీసీటీవీల్లో రికార్డయ్యాయి. అయితే ఎట్టకేలకు అతడిని పట్టుకోవడంతో పోలీసులు, జైలు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.