తిరుమల లడ్డూలపై ఊహించని వివాదం

తిరుమలలో లడ్డూలకు ఉపయోగించే నెయ్యికి సంబంధించి వివాదం కొనసాగుతూ ఉన్న సంగతి తెలిసిందే

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  3 Aug 2023 6:39 AM GMT
Controversy,Karnataka, ghee,Tirumala laddus

తిరుమల లడ్డూలపై ఊహించని వివాదం  

తిరుమలలో లడ్డూలకు ఉపయోగించే నెయ్యికి సంబంధించి వివాదం కొనసాగుతూ ఉన్న సంగతి తెలిసిందే..! కర్ణాటకలో కొత్తగా వచ్చిన కాంగ్రెస్ పార్టీ కారణంగానే తిరుమలకు నెయ్యిని పంపించలేదనే ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అయితే లడ్డూల తయారీలో గత రెండు దశాబ్దాలుగా కేవలం ఒక సంవత్సరం మాత్రమే నందిని నెయ్యిని వినియోగించామని తిరుమల ఆలయ దేవస్థానం (టీటీడీ) అధికారులు తెలిపారు. మరో వైపు సుప్రసిద్ధ ఆలయానికి నెయ్యి సరఫరా చేస్తున్న విషయంపై తాము ఎప్పుడూ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ అంటోంది. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రఖ్యాత తిరుమల వేంకటేశ్వర ఆలయానికి నందిని బ్రాండ్ నెయ్యిని ఇకపై కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (కెఎమ్‌ఎఫ్) సరఫరా చేయదని వార్తలు రావడంతో తిరుమల ప్రసాదంపై రాజకీయ చర్చ మొదలైంది.

కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కారణంగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయని భారతీయ జనతా పార్టీ నేతలు విమర్శలకు దిగారు. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం.. దేవాలయాలు, హిందూ విశ్వాసాలు, హిందువుల భక్తి పట్ల చిన్న చూపు కారణంగా నెయ్యి సరఫరాను నిలిపివేసిందని బీజేపీ నాయకుడు నళిన్ కుమార్ కటీల్ ఆరోపించారు. అయితే ఈ విమర్శలపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించింది. గత బీజేపీ ప్రభుత్వ హయాంలోనే ఒకటిన్నర సంవత్సరాల క్రితం నెయ్యి సరఫరా నిలిపివేసినట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంగళవారం తెలిపారు. కేఎంఎఫ్‌ చైర్మన్‌ భీమా నాయక్‌ తో మాట్లాడిన తర్వాతనే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ ప్రకటన చేశారు.

"సుమారు ఒక సంవత్సరం క్రితం వారు (టీటీడీ) టెండర్ కు పిలిచారు. టెండర్‌లో పాల్గొనమని కోరారు. మేము ఆ రేటుకు నెయ్యి ఇవ్వలేము, ఈ-ప్రొక్యూర్‌మెంట్ టెండర్‌లో, ఎవరు తక్కువ రేటు కోట్ చేస్తే వారికి ఆ టెండర్ లభిస్తుంది" అని నాయక్ అన్నారు. KMFతో పోలిస్తే ప్రస్తుత సరఫరాదారు TTDకి నెయ్యి చాలా తక్కువ ధరకే అందిస్తున్నారని అన్నారు. "తిరుపతి లడ్డూ కోసం KMF నెయ్యిని ఉపయోగించారు. నందిని నెయ్యి నాణ్యతకు మరే ఇతర నెయ్యి నిలబడదని నేను నమ్ముతున్నాను. ఇందుకు సంబంధించి మా కస్టమర్లు మాకు ఈ 100 శాతం సర్టిఫికేషన్ ఇచ్చారు" అని కూడా నాయక్ అన్నారు.

42 ట్రక్కుల ఆవు నెయ్యిని తిరస్కరించిన టీటీడీ:

టీటీడీ కార్యనిర్వహణాధికారి ఎవి ధర్మారెడ్డి మాట్లాడుతూ కెఎంఎఫ్‌ గత 20 ఏళ్లలో ఒక్కసారి మాత్రమే నెయ్యి సరఫరా చేసిందన్నారు.

"గత 20 సంవత్సరాలలో ఆ సంస్థ ఒకే ఒక్కసారి సరఫరా చేసింది. గత 19 సంవత్సరాలుగా మా లడ్డూలు బాగా లేవు.. ఒక సంవత్సరం మాత్రమే మంచివి అని మీరు అనుకుంటున్నారా, అది కూడా నందిని సంస్థ పంపించిన 20 శాతం నెయ్యితో? చేసినవి మాత్రమే బాగున్నాయని అంటున్నారా అని ప్రశ్నించారు ధర్మా రెడ్డి. "KMF TTD అవసరాలలో కేవలం 20 శాతాన్ని ఒకసారి మాత్రమే తీర్చింది, అది కూడా కేవలం ఆరు నెలల్లో ఇచ్చిన పనిని పూర్తి చేయవలసి ఉండగా.. నందిని సంస్థకు ఒక సంవత్సరం పట్టింది," అని రెడ్డి అన్నారు.

జూలై 22, 2022- జూన్ 30, 2023 మధ్య టీటీడీ చెప్పినట్లుగా కఠినమైన నాణ్యతా ప్రమాణాలను పాటించడంలో విఫలమవ్వడంతో గత ఏడాది కాలంలో 42 ట్రక్కుల ఆవు నెయ్యిని TTD తిరస్కరించింది. ప్రతి ట్రక్కు 18 టన్నుల వరకు నెయ్యి ను తీసుకువెళుతుంది, కేంద్రానికి చెందిన సీనియర్ రసాయన శాస్త్రవేత్తతో సహా ఆలయంలోని ఆరోగ్యం, విజిలెన్స్, ఇంజినీరింగ్, ఇతర విభాగాలకు సంబంధించిన కమిటీ స్వచ్ఛత, నాణ్యత ను ఆడిట్ చేస్తాయి. "టీటీడీకి రోజుకు 15,000 కిలోల నెయ్యి అవసరం, నెలకు 450 టన్నులు.. సంవత్సరానికి 5,400 టన్నులు. KMF కేవలం 20 శాతం అవసరాన్ని సమయానికి తీర్చలేనప్పుడు.. నాయక్ మా మొత్తం అవసరాలను ఎలా తీర్చగలడు," అని ధర్మా రెడ్డి చెప్పుకొచ్చారు.

స్పందించిన KMC :

నందిని నెయ్యికి సంబంధించి ఒక సంవత్సరం ఒప్పందంపై TTD చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా.. ఒక KMF అధికారి మాట్లాడుతూ "మేము TTDకి ఎంతకాలం నెయ్యి సరఫరా చేస్తున్నామో KMF ఎప్పుడూ ఎటువంటి ప్రకటనలు చేయలేదు." అని అన్నారు.

KMF మేనేజింగ్ డైరెక్టర్, CEO MK జగదీష్ మాట్లాడుతూ, "మేము చివరిగా 345 మెట్రిక్ టన్నుల (నెయ్యి), అంటే 2021-22 సంవత్సరంలో సరఫరా చేసాము. మేము మరోసారి (TTDతో) అనుబంధాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నాము. మేము మా నాణ్యత గురించి వారికి తెలియజేస్తున్నాము. మా నెయ్యి చాలా శ్రేష్ఠమైనది. మేము వారికి నెయ్యిని అందించాలనుకుంటున్నాము. కానీ ధర విషయంలో మాత్రమే కొన్ని సమస్యలు ఉన్నాయి. మేము వారితో చర్చలు జరపడానికి ప్రయత్నిస్తున్నాము." అని తెలిపారు.

అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పాల ధరలను పెంచిందని, దీంతో నందిని నెయ్యిని టీటీడీ బోర్డుకు మునుపటి ధరకు సరఫరా చేయడం సాధ్యం కాదని బీజేపీ సీనియర్ నేత సీటీ రవి అన్నారు. నందిని పాల ధరలను లీటరుకు మూడు రూపాయలు పెంచాలన్న KMF ప్రతిపాదనకు కర్ణాటక మంత్రివర్గం జూలై 27న ఆమోదం తెలిపింది. కొత్త ధరలు ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చాయి.

Next Story