ఆర్థిక నేరస్తుడు సుకేశ్ చంద్రశేఖర్‌ను శుక్రవారం ఢిల్లీలోని పాటియాల హౌజ్ కోర్టులో హాజరుపరిచారు. ఓ మనీలాండరింగ్ కేసులో సుకేశ్ చంద్రశేఖర్‌ను పోలీసులు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తర్వాత అరెస్టు కాబోయేది అరవింద్ కేజ్రీవాలే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ పాలసీ కేసులో మనీశ్ సిసోడియా తర్వాత అరెస్టు అయ్యేది అరవింద్ కేజ్రీవాల్ అని అన్నాడు. లిక్కర్ స్కామ్‌లో అరవింద్ కేజ్రీవాల్ ప్రమేయం త్వరలోనే బట్టబయలు అవుతుందని ఆరోపించారు. అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, ఇతర ఆప్ నేతలను టార్గెట్ చేస్తూ గతంలో కూడా సుకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సిసోడియా, సత్యేందర్ జైన్ కేజ్రీవాల్ కీలుబొమ్మలని ఆయన అన్నారు.
‘‘సత్యం గెలిచింది, తర్వాత నెంబర్ అరవింద్ కేజ్రీవాల్‌దే. మద్యం పాలసీ విషయంలో నేను అన్నీ లిఖితపూర్వకంగా ఇచ్చాను, వాటన్నింటినీ బయటపెడతాను.. అరవింద్ కేజ్రీవాల్ వారి (మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్) మాస్టర్. 2015 నుంచి వారితో నాకు అనుబంధం ఉంది’’ అని చంద్రశేఖర్ ఆరోపించారు. రద్దు చేయబడిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అవకతవకలకు సంబంధించి మనీలాండరింగ్ ఆరోపణలపై ఢిల్లీ మాజీ డిప్యూటీ సిఎం మనీష్ సిసోడియాను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసింది.