కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కాన్వాయ్‌పై కాంగ్రెస్ కార్యకర్తలు కోడిగుడ్లతో దాడి చేశారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో ఉన్న ఎయిర్‌పోర్ట్‌లో ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. కొద్ది రోజుల క్రితం ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌లో జరిగిన దుర్ఘటనలో అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో నలుగురు రైతులు సహా ఎనిమిది మంది చనిపోయారు. దీనిపై కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున నిరసన చేస్తున్నాయి. కేంద్ర మంత్రి పదవి నుంచి అజయ్ మిశ్రాను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. మంత్రిపై కోడిగుడ్ల దాడిని ఖండిస్తూ బీజేపీ కార్యకర్తలు ఎయిర్‌పోర్ట్ ముందు నిరసనకు దిగారు.
అజయ్ మిశ్రా ఒక కార్యక్రమానికి హాజరయ్యేందుకు భువనేశ్వర్ వచ్చారు. ఆయన కాన్వాయ్ విమానాశ్రయం ఆవరణ నుండి బయలుదేరి నగరం వైపు వెళుతుండగా, ఇద్దరు ఎన్‌ఎస్‌యుఐ కార్యకర్తలు అకస్మాత్తుగా కేంద్ర మంత్రి కారు ముందు వచ్చి గుడ్లు విసిరారు. భువనేశ్వర్‌లోని బిజూ పట్నాయక్ విగ్రహం వద్ద, క్యాపిటల్ హాస్పిటల్ దగ్గర వందలాది మంది ఎన్‌ఎస్‌యుఐ కార్యకర్తలు కాన్వాయ్‌కు నల్లజెండాలు చూపుతూ నిరసన తెలిపారు. దాదాపు 15 మంది కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నట్లు భువనేశ్వర్ డీసీపీ ఉమాశంకర్ దాష్ తెలిపారు.