కర్ణాటక సీఎం.. ఆశావహులతో కాంగ్రెస్‌కు సుదీర్ఘ పోరాటం తప్పదా..!
Congress will have a long fight with the aspirants. కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవిపై పోరు కొనసాగుతోంది. సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లిద్దరూ ఢిల్లీలో ఉన్నారు.
By Medi Samrat Published on 16 May 2023 9:30 AM GMTకర్ణాటకలో ముఖ్యమంత్రి పదవిపై పోరు కొనసాగుతోంది. సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లిద్దరూ ఢిల్లీలో ఉన్నారు. ఈరోజు పార్టీ హైకమాండ్‌తో భేటీ అయిన తర్వాత సీఎం పేరు ప్రకటిస్తారని విశ్వసనీయ సమాచారం. సిద్ధరామయ్య, శివకుమార్ ఇద్దరూ బలమైన వాదనలు చేస్తున్నారు. సిద్ధరామయ్య గతంలో సీఎంగా ఉన్నారు. ఇవే చివరి ఎన్నికలు.. సీఎం సీటు నాకే కావాలని వాదన బలంగా వినిపిస్తున్నారు. అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని గెలిపించడంలో శివకుమార్ కీలక పాత్ర పోషించారు. అటువంటి పరిస్థితిలో ఆయన వాదనను తక్కువ అంచనా వేయలేము. వీరిద్దరిలో ఎవరిని సీఎం చేయాలనేది పార్టీ ముందున్న పెద్ద సవాల్. అంతకుముందు 2018లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో కూడా ఇదే విధమైన సంఘటన పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఎంపికచేయడానికి కూడా అధిష్టానం సుదీర్ఘ పోరాటం చేయాల్సి వచ్చింది.
2018లో రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అందులో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ముఖ్యమంత్రిని ఎన్నుకునే విషయానికి వస్తే.. అనుభవం ఉన్న అశోక్ గెహ్లాట్, డైనమిక్ సచిన్ పైలట్‌లలో ఎవరిని ఎన్నుకోవాలో పార్టీకి సవాలుగా మారింది. చివరికి అనుభవజ్ఞుడైన నాయకుడు గెహ్లాట్‌పై విశ్వాసం ఉంచింది. అతనిని ముఖ్యమంత్రిని చేయాలని నిర్ణయించుకుంది. పైలట్, గెహ్లాట్ ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిశారు. ఆ తర్వాత విడుదల చేసిన చిత్రంలో ఇద్దరు నేతలు నవ్వుతూ కనిపించారు. అయితే.. పార్టీ హైకమాండ్ నిర్ణయంపై పైలట్ సంతృప్తి చెందలేదు. ఆయనను సీఎం చేయాలని ఆయన మద్దతుదారులు కోరుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని గెలిపించడంలో పైలట్ కూడా కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు అవినీతి, ప్రభుత్వ నియామక పరీక్షల పేపర్ లీక్ వ్యవహారంపై పైలట్ సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా జన సంఘర్ష్ యాత్రను చేపట్టారు. తమ డిమాండ్లను నెరవేర్చకుంటే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.
మధ్యప్రదేశ్‌లో 2018 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ 200 సీట్లలో 100 గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే ఇక్కడ కూడా ముఖ్యమంత్రి పదవికి ఇద్దరు పోటీదారులు ఉన్నారు. ఒకరు కమల్ నాథ్, మరొకరు జ్యోతిరాదిత్య సింధియా. కమల్ నాథ్ గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. గాంధీ కుటుంబంతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. అదే సమయంలో సింధియా రాహుల్ గాంధీకి సన్నిహితంగా ఉండేవారు. ఇక్కడ కూడా అనుభవజ్ఞుడైన కమల్‌నాథ్‌పైనే పార్టీ హైకమాండ్ విశ్వాసం ఉంచింది. రాహుల్ గాంధీతో పాటు కమల్ నాథ్, సింధియా నవ్వుతున్న చిత్రం కూడా బయటకు వచ్చింది. అయితే సింధియా తర్వాత కాంగ్రెస్‌ను వీడడంతో ఆ పార్టీ రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయింది.
ఛత్తీస్‌గఢ్‌లో కూడా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన కాంగ్రెస్‌లో ఇద్దరు సీఎం పదవికి పోటీ పడ్డారు. భూపేష్ బఘేల్, టీఎస్ సింగ్ దేవ్ ఇద్దరూ ముఖ్యమంత్రి ఫీఠాన్ని కోరుకున్నారు. అటువంటి పరిస్థితిలో పార్టీ బఘెల్‌పై విశ్వాసం ఉంచి.. ఆయనను ముఖ్యమంత్రిని చేసింది. సింగ్‌దేవ్ నిరాశ చెందారు. ఇద్దరు నేతలతో కలిసి రాహుల్ గాంధీ నవ్వుతున్న ఫోటో బయటకు వచ్చింది.
మొత్తానికి కాంగ్రెస్ అధికారంలోకి వ చ్చిన రాష్ట్రాల్లో సీఎంను ఎన్నుకోవడం సవాల్ గా మారింది. అయితే.. సింధియా పార్టీని వీడిన తర్వాత.. మధ్యప్రదేశ్ లాంటి పరిస్థితి రాకుండా పార్టీ హైకమాండ్ ఏ నిర్ణయమైనా జాగ్రత్తగా తీసుకుంటుంది.