హిమాచ‌ల్‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు.. కాంగ్రెస్, బీజేపీ మ‌ధ్య హోరాహోరీ

Congress To Shift MLAs Out Of Himachal To Prevent Poaching.హిమాచ‌ల్‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు గురువారం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 Dec 2022 5:52 AM GMT
హిమాచ‌ల్‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు.. కాంగ్రెస్, బీజేపీ మ‌ధ్య హోరాహోరీ

హిమాచ‌ల్‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు గురువారం ఉద‌యం ప్రారంభ‌మైంది. మొత్తం 68 స్థానాలకు న‌వంబ‌ర్ 12న ఒకే విడత‌లో ఎన్నిక‌లు జ‌రిగాయి. ఈ రోజు ఓట్ల లెక్కింపును చేప‌ట్టారు. ఇప్ప‌టి వ‌ర‌కు అందుతున్న స‌మాచారం ప్ర‌కారం భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ), కాంగ్రెస్ ల మ‌ధ్య తీవ్ర పోటీ నెల‌కొంది. కాంగ్రెస్ పార్టీ 34, బీజేపీ 30 స్థానాల్లో లీడింగ్‌లో ఉన్నాయి. హిమాచల్ ప్ర‌దేశ్‌లో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 35 స్థానాల్లో విజ‌యం సాధించాల్సి ఉంటుంది.

రెండు పార్టీలూ స్వల్ప ఆధిక్యంలో ఉండ‌డంతో ఆయా పార్టీలు త‌మ వ్యూహాల‌కు ప‌దునుపెట్టాయి. త‌మ‌, త‌మ ఎమ్మెల్యేల‌ను కాపాడుకునే ప‌నిలో నిమ‌గ్నం అయిన‌ట్లు తెలుస్తోంది. బీజేపీ 'ఆపరేషన్ లోటస్' ప్రయత్నాలను అడ్డుకునేందుకు ఈ ఫ‌లితాల్లో విజ‌యం సాధించిన ఎమ్మెల్యేల‌ను కాంగ్రెస్ గురువారం సాయంత్రం బ‌స్సుల్లో రాజ‌స్థాన్ త‌ర‌లించ‌న‌ట్లు స‌మాచారం.

ఎమ్మెల్యేలను కాపాడుకునే బాధ్యతను చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్, సీనియర్ నేత భూపిందర్ సింగ్ హుడాలకు అప్ప‌గించిన‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల ద్వారా తెలిసింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వ్యక్తిగతంగా హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌లోని ప‌రిస్థితుల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ఈ రోజు మ‌ధ్యాహ్నాం ఆమె సిమ్లాకు చేరుకుంటార‌ని కాంగ్రెస్ వ‌ర్గాలు చెప్పాయి.

68 అసెంబ్లీ స్థానాలు ఉండ‌గా 412 అభ్య‌ర్థులు పోటీ చేశారు. 75.60 పోలింగ్ శాతం న‌మోదైంది. మ‌రీ హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ప్ర‌జ‌లు ఏ పార్టీకి అవ‌కాశం ఇస్తారో మ‌రి కొన్ని గంట‌ల్లో తేలిపోనుంది.

Next Story