కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల
Congress to issue notification for party president polls.కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడింది.
By తోట వంశీ కుమార్ Published on 22 Sept 2022 11:55 AM ISTసుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికకు గురువారం నోటిఫికేషన్ వెలువడింది. కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ అధ్యక్ష ఎన్నిక నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. సెప్టెంబర్ 24 నుంచి 30 వరకు నామినేషన్ల ప్రక్రియ జరగనుంది. అక్టోబర్ 1న నామినేషన్ పత్రాలను పరిశీలిస్తారు. నామినేషన్ ఉపసంహరణకు అక్టోబర్ 8 వరకు గడవు ఇచ్చారు. పోటీలో ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు ఉంటే అక్టోబర్ 17న ఓటింగ్‌ను నిర్వహించనున్నారు. అనంతరం అక్టోబర్ 19న పలితాలను వెల్లడించనున్నారు.
కాగా.. అధ్యక్ష పదవికి ఎవరు పోటీచేస్తున్నారనే అంశంపై ఇప్పటివరకు స్పష్టత లేదు. అయితే రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, పార్టీ సీనియర్ నేత శశిథరూర్ పోటీ పడనున్నారని తెలుస్తోంది. పార్టీ కోరుకుంటే అధ్యక్ష పదవికి నామపత్రాలు దాఖలు చేస్తానని అశోక్ గెహ్లాట్ తెలిపారు. పార్టీ ఇచ్చిన ఏ బాధ్యత అయినా నెరవేర్చుతానని ఇప్పటికే ఆయన వెల్లడించారు.
వీరిద్దరితో పాటు మరో నేత కూడా పేరు కూడా వినిపిస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ గురువారం ఢిల్లీకి రానున్నారు. పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో ఆయన భేటీ కానున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. దీంతో దిగ్విజయ్ కూడా అధ్యక్ష ఎన్నికకు పోటి చేయాలనే యోచనలో ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
కాంగ్రెస్ అధ్యక్ష పదవి వద్దంటూ రాహుల్ గాంధీ భీష్మించుకు కూర్చోవడంతో ఎన్నిక అనివార్యమైంది. దేశవ్యాప్తంగా వరుస ఓటములు, సీనియర్లు, కీలకనేతల రాజీనామాల నేపథ్యంలో కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తీసుకు రావడమే లక్ష్యంగా ఈసారి ఎన్నిక జరగనుంది. పార్టీలో ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా, పారదర్శకంగా నిర్వహించాలని, అధ్యక్ష ఎన్నికలకు పోటీ చేసేందుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అనుమతి అవసరం లేదని ఇప్పటికే పార్టీ స్పష్టం చేసింది.