కేరళలోని వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటాన్ని ఘోరమైన విషాదంగా అభివర్ణించిన కాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. ఒక్క ప్రాంతంలో ఇంత పెద్ద ఘటనను రాష్ట్రంలో ఎన్నడూ చూడలేదని అన్నారు. ఈ ఘటనను మరో విధంగా పరిష్కరించాలని పిలుపునిచ్చారు. ఈ విషయాన్ని తాను ఢిల్లీలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో కూడా లేవనెత్తుతానని.. ఇది వేరే స్థాయి విషాదమని.. దీనిని భిన్నంగా పరిష్కరించాలని అన్నారు. ప్రస్తుతం మృతదేహాలను, ప్రాణాలతో బయటపడినవారిని గుర్తించడంతోపాటు అలాగే నిరాశ్రయులైన ప్రజలను శిబిరాల్లో సౌకర్యవంతంగా ఉండేలా చూడాలని ఆయన చెప్పారు.
కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలకు తిరిగి వెళ్లకూడదని.. చాలా మంది ప్రాణాలతో బయటపడినందున పునరావాసం చాలా ముఖ్యమైనదని కాంగ్రెస్ ఎంపీ అన్నారు. సురక్షితమైన ప్రాంతంలో పునరావాసం పొందడం చాలా ముఖ్యం. వారు తిరిగి వెళ్లేందుకు బలవంతం చేయకూడదని అన్నారు.
వాయనాడ్‌లో కాంగ్రెస్ పార్టీ 100కు పైగా ఇళ్లను నిర్మిస్తుందని హామీ ఇచ్చారు. వయనాడ్ పర్యటనలో భాగంగా జిల్లా యంత్రాంగం, పంచాయతీ అధికారులతో సమావేశమైన అనంతరం రాహుల్ గాంధీ మీడియాతో ఈ విషయాలు చెప్పారు. ఆ సమయంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, ఇతర కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా ఆయన వెంట ఉన్నారు.
అంతకుముందు రోజు ఉదయం రాహుల్, ప్రియాంక, ఎఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్, కెపిసిసి చీఫ్ కె సుధాకరన్, రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు విడి సతీశన్‌తో పాటు ఇతర పార్టీ సీనియర్ నాయకులు.. మెప్పాడి గ్రామ పంచాయతీ ప్రతినిధి బృందంతో సమావేశమై వారి సమస్యలను, అవసరాలను అడిగి తెలుసుకున్నారు.