పంజాబ్ లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్.. రైతు చట్టాల మీద ఆగ్రహమేనా..?
Congress Sweeps Punjab Urban Body Polls, BJP Routed Amid Farmers' Protest. పంజాబ్ ఏడు మున్సిపల్ కార్పొరేషన్లను కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది.
By Medi Samrat
బఠిండా మున్సిపల్ కార్పొరేషన్ లో 53 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ గెలిచింది. బఠిండా అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ నేత, రాష్ట్ర ఆర్థిక మంత్రి మన్ ప్రీత్ సింగ్ బాదల్ నేతృత్వం వహిస్తుండగా.. ఇటీవలే ఎన్డీయే నుంచి వైదొలిగిన శిరోమణి అకాలీ దళ్ ఎంపీ హర్ సిమ్రత్ కౌర్ లోక్ సభ నియోజకవర్గానికి నేతృత్వం వహించారు. వ్యవసాయ చట్టాల విషయంలో భారతీయ జనతా పార్టీ మీద పంజాబ్ లో వ్యక్తమవుతున్న వ్యతిరేకత ఈ ఎన్నికల్లో కనిపించింది.
బఠిండాలో గెలవడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలను కాంగ్రెస్ ఎమ్మెల్యే, రాష్ట్ర ఆర్థిక మంత్రి మన్‌ప్రీత్ సింగ్ బాదల్ ట్విటర్‌లో షేర్ చేశారు. ''ఈరోజు సరికొత్త చరిత్ర సృష్టించబడింది: 53 ఏళ్ల తర్వాత తొలిసారిగా భాటిండాకు కాంగ్రెస్ మేయర్ రాబోతున్నారు. ఇంతటి ఘన విజయం అందించిన భాటిండా ప్రజలకు ధన్యవాదాలు. పార్టీ అభ్యర్థులు, కార్యకర్తలకు శుభాకాంక్షలు'' అని హర్షం వ్యక్తం చేశారు.
ఫిబ్రవరి 14న 109 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు, ఏడు మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. 71.39 శాతం పోలింగ్ నమోదైంది. మొహాలీ కార్పొరేషన్ కు సంబంధించి 32, 33వ నెంబర్ బూత్ లకు రీపోలింగ్ నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే మొహాలీ కార్పొరేషన్ ఫలితాలను గురువారం ప్రకటించనున్నారు. మొత్తం 9,222 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అత్యధికంగా 2,832 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేశారు.