ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు మరికొద్ది రోజులే మిగిలి ఉంది. దీంతో అన్ని రాజకీయ పార్టీలు తమ శక్తియుక్తులను ప్రదర్శిస్తున్నాయి. కాంగ్రెస్ కూడా ఎన్నికల కోసం కసరత్తు చేస్తోంది. ఈసారి కాంగ్రెస్ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోలేదు. మొత్తం 403 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను బరిలోకి దింపుతోంది. కాంగ్రెస్ ఎన్నికల ప్రచారానికి ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ స్వయంగా నాయకత్వం వహించారు. కాగా, సోమవారం పార్టీ 28 మంది అభ్యర్థులతో కూడిన మరో జాబితాను విడుదల చేసింది. అభ్యర్థుల జాబితాలో 11 మంది మహిళల పేర్లు ఉన్నాయి.
ఈసారి 40 శాతం మంది మహిళలకు టిక్కెట్లు ఇస్తామని ప్రియాంక గాంధీ వాద్రా ప్రకటించడం గమనార్హం. ఇప్పటి వరకు విడుదల చేసిన అభ్యర్థుల జాబితాల్లో ఈ పరిణామం చోటు చేసుకుంది. సోమవారం విడుదల చేసిన జాబితాలో హండియా అసెంబ్లీ స్థానం నుంచి రీనా దేవి బింద్, చైల్ నుంచి తలత్ అజీమ్, మేజా నుంచి మాధవి రాయ్, కర్చన నుంచి రింకీ సునీల్ పటేల్‌లకు టిక్కెట్లు ఇచ్చారు. కాటేహరి అసెంబ్లీ స్థానం నుంచి నిషాత్ ఫాతిమా, బల్హా నుంచి కిరణ్ భారతి, తరబ్‌గంజ్ నుంచి త్వరితా సింగ్, మన్కాపూర్ నుంచి సంతోష్ కుమారి, బన్స్‌గావ్ నుంచి పూనమ్ ఆజాద్, చిలుపర్ నుంచి సోనియా శుక్లా, ఘోసీ నుంచి ప్రియాంక యాదవ్‌లను కాంగ్రెస్ బరిలోకి దించింది.