కేంద్ర ప్రభుత్వం త్వరలో జనాభా గణన చేపట్టనుంది. దీని కోసం ప్రభుత్వం రిజిస్ట్రార్ జనరల్,సెన్సస్ కమిషనర్ పదవీకాలాన్ని పొడిగించింది. దీనికి నోటిఫికేషన్ కూడా విడుదలైంది. దీనిపై ఇప్పుడు కాంగ్రెస్ ప్రశ్నలు లేవనెత్తింది. చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న జనాభా గణనను ఎట్టకేలకు త్వరలో నిర్వహించనున్నట్లు ప్రభుత్వ నోటిఫికేషన్ ద్వారా స్పష్టమవుతోందని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ఒక పోస్ట్‌లో రాశారు. జనాభా లెక్కల సర్వేకు ముందు రెండు ముఖ్యమైన అంశాలపై ఇప్పటికీ స్పష్టత లేదని ఆయన అన్నారు.
1951 నుంచి ప్రతి జనాభా గణనలో జరుగుతున్న షెడ్యూల్డ్ కులాలు, తెగల గణనతో పాటు ఈ కొత్త జనాభా లెక్కల్లో కుల గణనను కూడా కలుపుతారా..? అని అడిగారు. భారత రాజ్యాంగం ప్రకారం.. అటువంటి కుల గణన కేంద్ర ప్రభుత్వ బాధ్యత అన్నారు.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 82లో అందించిన విధంగా లోక్‌సభలో ప్రతి రాష్ట్రం యొక్క ప్రతినిధుల సంఖ్యను నిర్ణయించడానికి ఈ జనాభా గణన ఉపయోగించబడుతుందా.? కుటుంబ నియంత్రణలో అగ్రగామిగా ఉన్న రాష్ట్రాలకు ఇది హాని చేస్తుందా.? ఈ రెండు అంశాలపై స్పష్టత రావడానికి త్వరలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.