ఉత్తరప్రదేశ్‌లో ఉపఎన్నికలు జరుగుతున్న తొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టబోమని.. అయితే ఇండియా కూటమి అభ్యర్థులకు మద్దతు ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. కాంగ్రెస్ ఉత్తరప్రదేశ్ చీఫ్ అజయ్ రాయ్‌తో కలిసి ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అవినాష్ పాండే ఈ వ్యాఖ్యలు చేశారు. సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థులు లేదా ఇతర ఇండియా కూటమి పార్టీల గెలుపునకు పార్టీ కార్యకర్తలు, నాయకులు బేషరతుగా కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు పార్టీని బలోపేతం చేయడం గురించి కాదని, రాజ్యాంగాన్ని పరిరక్షించడమేనని ఆయన అన్నారు. కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేత ఆరాధన మిశ్రా, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సమాజ్‌వాదీ పార్టీ నాయకత్వంతో సంప్రదింపులు జరిపిన తర్వాత ఈ నిర్ణయానికి వచ్చినట్లు పాండే తెలిపారు.
ఇండియా కూటమి అభ్యర్థులందరూ ఉత్తరప్రదేశ్‌లో జరిగే ఉప ఎన్నికల్లో తమ 'సైకిల్' ఎన్నికల గుర్తుపై పోటీ చేస్తారని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తెలిపిన మరుసటి రోజే కాంగ్రెస్ ఈ ప్రకటన చేసింది. కతేహరి, కర్హల్, మీరాపూర్, ఘజియాబాద్, మజ్హవాన్, సిసమావు, ఖైర్, ఫుల్పూర్, కుందర్కి తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 13న ఉప ఎన్నికలు నిర్వహించి, నవంబర్ 23న ఫలితాలు వెల్లడిస్తారు.