పుదుచ్చేరిని కూడా కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ
Congress Loses Power In Puducherry. తాజాగా కాంగ్రెస్ పార్టీ పుదుచ్చేరిని కూడా కోల్పోయింది.
By Medi Samrat Published on 22 Feb 2021 3:24 PM ISTకాంగ్రెస్ పార్టీ ఒకప్పటి పరిస్థితి వేరు.. ఇప్పటి పరిస్థితి వేరు. కొన్ని రాష్ట్రాల ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా నిలిచినప్పటికీ.. అధికారాన్ని సొంతం చేసుకోవడం, నిలబెట్టుకోవడాల్లో తీవ్రంగా విఫలమయ్యాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ పుదుచ్చేరిని కూడా కోల్పోయింది. 2016 ఎన్నికల్లో ఈ కేంద్ర పాలిత ప్రాంతాన్ని డీఎంకేతో కలిసి కాంగ్రెస్ సొంతం చేసుకుంది. గడిచిన నాలుగున్నరేళ్లు పరిపాలన సజావుగా సాగింది గతేడాది పార్టీ ఎమ్మెల్యే ధనవేల్ సైడ్ అవ్వడంతో నారాయణ స్వామి ప్రభుత్వానికి ఇబ్బందులు మొదలయ్యాయి. 33 మందితో కూడిన పుదుచ్చేరి అసెంబ్లీలో అధికారం చేపట్టేందుకు 17 మంది సభ్యుల మద్దతు కావాలి. కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలు ఒకరి తర్వాత మరొకరు రాజీనామాలు చేస్తూ వెళ్లడంతో ప్రభుత్వం మైనారిటీలో ప్రభుత్వం పడింది. ఆరుగురు ఎమ్మెల్యేలు రాజీనామాతో కాంగ్రెస్ సర్కార్ కుప్పకూలింది.
బల నిరూపణలో నారాయణస్వామి సర్కార్ నేడు విఫలమయ్యింది. కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలింది. సరైన సంఖ్యా బలం లేకపోవడంతో విశ్వాస పరీక్షకు వెళ్లకుండానే సీఎం సభ నుంచి వెళ్లి పోయారు. సభ ప్రారంభమైన తర్వాత సీఎం నారాయణ స్వామి విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనిపై ఓటింగ్ జరగకముందే ఆయన తన పార్టీ ఎమ్మెల్యేలతో సభ నుంచి బయటకు వెళ్లి పోయారు. దాంతో విశ్వాసం తీర్మానం వీగిపోయినట్లు స్పీకర్ వీపీ శివకొలందు ప్రకటించారు. ఉదయం బల నిరూపణలో విఫలమైన తరువాత, తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన నారాయణ స్వామి బీజేపీపై నిప్పులు చెరిగారు. కిరణ్ బేడీ లెఫ్టినెంట్ గవర్నర్ గా నియమితురాలైన నాటి నుంచి విపక్ష ఎమ్మెల్యేలకే మద్దతుగా నిలిచి, సంక్షేమాన్ని వదిలేశారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయాలను అడ్డుకున్నారని, తన ప్రభుత్వం తీసుకువచ్చిన పథకాలను ప్రజలకు చేరనివ్వ లేదని మండిపడ్డారు. రాజీనామాలు చేసిన కాంగ్రెస్ నేతలు మనసు మార్చుకుంటారనే భావిస్తున్నానని నారాయణ స్వామి అన్నారు.