షమీకి మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ నాయకురాలు.. గతంలో రోహిత్‌ను టార్గెట్ చేసింది..!
ఆస్ట్రేలియాతో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఉపవాసం ఉండనందుకు మహ్మద్ షమీకి కాంగ్రెస్ నాయకురాలు షామా మహ్మద్ మద్దతు లభించింది.
By Medi Samrat Published on 7 March 2025 9:15 AM IST
ఆస్ట్రేలియాతో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఉపవాసం ఉండనందుకు మహ్మద్ షమీకి కాంగ్రెస్ నాయకురాలు షామా మహ్మద్ మద్దతు లభించింది. షమీని టార్గెట్ చేసిన మౌల్వీపై కూడా విరుచుకుపడింది. దుబాయ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఎనర్జీ డ్రింక్ తాగుతూ కనిపించిన షమీని ఆల్ ఇండియా ముస్లిం జమాత్ అధ్యక్షుడు మౌలానా షహబుద్దీన్ రజ్వీ బరేల్వీని క్రిమినల్‌గా అభివర్ణించారు. రంజాన్‌లో ఉపవాసం పాటించనందుకు షమీ షరీయత్ దృష్టిలో నేరస్థుడని ఆయన అన్నారు.
దీనిపై షామా మహ్మద్ మాట్లాడుతూ.. ఇస్లాంలో ఉపవాసాలకు మినహాయింపు ఉందన్నారు. ముఖ్యంగా ప్రయాణాలు చేసేవారికి లేదా శారీరకంగా అలసిపోయే కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నవారికి మినహాయింపు ఉందని పేర్కొన్నారు. ఇస్లాంలో రంజాన్ సందర్భంగా తెలుసుకోవాల్సిన చాలా ముఖ్యమైన విషయం ఉంది. మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఉపవాసం ఉండనవసరం లేదు. మహ్మద్ షమీ పర్యటనలో ఉన్నాడు.. అతని ఇంట్లో లేడు. చాలా దాహం వేసే ఆట ఆడుతున్నారు. క్రీడలు ఆడుతున్నప్పుడు ఉపవాసం ఉండాలని ఎవరూ గట్టిగా చెప్పరు. మీ పని చాలా ముఖ్యం. ఇస్లాం చాలా శాస్త్రీయ మతం అని పేర్కొన్నారు.
అయితే ఇటీవల భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ పిట్‌నెస్‌పై కాంగ్రెస్ నేత షామా మహమ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రోహిత్ శర్మ చాలా లావుగా ఉన్నాడని 'X' పోస్ట్‌లో పేర్కొంది. 'అతను బరువు తగ్గాలి!.. అతడు గతంలో ఎన్నడూ లేని అత్యంత అసమర్థ కెప్టెన్ అని వ్యాఖ్యానించింది.
అంతకుముందు ఆల్ ఇండియా ముస్లిం జమాత్ అధ్యక్షుడు మౌలానా షహబుద్దీన్ రజ్వీ బరేల్వీ షమీపై తీవ్ర విమర్శలు చేశారు. రంజాన్ తప్పనిసరి విధుల్లో ఒకటి 'రోజా'(ఉపవాసం).. ఆరోగ్యవంతుడైనన పురుషుడు లేదా స్త్రీ 'రోజా' ఉండకపోతే, వారు పెద్ద నేరస్థులు అవుతారు. భారత్‌కు చెందిన ప్రముఖ క్రికెటర్ మహ్మద్ షమీ మ్యాచ్ సమయంలో నీరు లేదా మరేదైనా పానీయాన్ని సేవించాడు. ప్రజలు అతడివైపే చూస్తున్నారు. షమీ ఆడుతున్నాడంటే ఆరోగ్యంగా ఉన్నాడని అర్థం. ఇలాంటి పరిస్థితుల్లో 'రోజా' ఉండకుండా నీళ్లు కూడా తాగేశాడు. ఇది ప్రజలకు తప్పుడు సందేశాన్ని పంపుతుంది.. 'రోజా'ను పట్టించుకోకుండా నేరం చేశారురు. వారు ఇలా చేయకూడదు. షరియత్ దృష్టిలో అతడు నేరస్థుడు. అతడు దేవునికి సమాధానం చెప్పాలి." అని వ్యాఖ్యానించారు.