సాయంత్రం సీఎల్పీ సమావేశం.. నెక్ట్స్ కర్ణాటక సీఎంను డిసైడ్ చేస్తారు..!
Congress CLP meet tomorrow at 5.30 pm to decide who will be Karnataka CM. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బంపర్ మెజారిటీ వచ్చింది.
By Medi Samrat Published on 14 May 2023 2:51 PM ISTకర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బంపర్ మెజారిటీ వచ్చింది. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. అయితే.. సీఎం విషయంలో ఆ పార్టీలో గుబులు కొనసాగుతోంది. సీఎం పేరు ప్రకటనపై ఏకాభిప్రాయానికి రావడానికి ఈరోజు సాయంత్రం బెంగళూరులోని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశం జరుగనుంది. కర్ణాటకలో కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ సాయంత్రం సమావేశమై ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించి.. ముఖ్యమంత్రి అభ్యర్థిపై తమ అభిప్రాయాలను తెలియజేయనున్నారు. మాజీ సీఎం సిద్ధరామయ్య, కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డికె శివకుమార్ సీఎం పదవికి బలమైన పోటీదారులుగా రేసులో ముందంజలో ఉన్నారు.
సమాచారం ప్రకారం.. కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సిఎల్‌పి) సమావేశం ఈరోజు సాయంత్రం 5:30 గంటలకు ప్రారంభమవుతుంది. కొత్తగా ఎన్నికైన నాయకులందరినీ బెంగళూరుకు రావాలని పార్టీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు కర్ణాటకలో కాంగ్రెస్ అధిష్టానం సుశీల్ కుమార్ షిండే, దీపక్ బవారియా, భన్వర్ జితేంద్ర సింగ్‌లను పరిశీలకులుగా నియమించింది. ఈరోజు జరగనున్న కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశానికి పరిశీలకులు హాజరై పార్టీ హైకమాండ్‌కు నివేదిక సమర్పించనున్నారు.
సీఎల్పీ సమావేశానికి ముందే సిద్ధరామయ్య సహా పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే నివాసంలో ఈరోజు సమావేశమయ్యారు. దీనిని మర్యాదపూర్వక భేటీగా అభివర్ణించారు. కాంగ్రెస్ నేత ప్రియాంక్ ఖర్గే కూడా సమావేశానికి హాజరయ్యారు. మొత్తం 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీకి మే 10న జరిగిన ఎన్నికల్లో.. కాంగ్రెస్ 135 సీట్లతో అఖండ విజయం సాధించడం గమనార్హం. అధికార బీజేపీకి 66 సీట్లు, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ నేతృత్వంలోని జనతాదళ్ (సెక్యులర్)కి 19 సీట్లు వచ్చాయి.