కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జోడో యాత్ర 18వ రోజు బుధవారం కేరళలో ప్రారంభమైంది. రాహుల్ గాంధీతో పాటు వందలాది మంది పార్టీ కార్యకర్తలు, అనుచరులు పాల్గొన్న ఈ యాత్ర నేడు వాయనాడ్ లోక్‌సభ నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది. పండిక్కాడ్ స్కూల్ పాడి నుంచి ప్రారంభమైన పాదయాత్ర.. ఉదయం 10.30 గంటలకు వండూరు జంక్షన్ చేరుకుని విరామం కోసం ఆగుతుంది. ఈ క్రమంలోనే నేడు వాయనాడ్ నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశిస్తుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఇన్‌ఛార్జ్ జైరాం రమేష్ తెలిపారు.
"ఈరోజు ఉదయం 6:10 గంటలకు మా కంటైనర్ క్యాంప్‌సైట్‌లో జెండాను ఎగురవేసే గౌరవం నాకు లభించింది. ఈరోజు కేరళలో భారత్ జోడో యాత్ర 18వ రోజు.. పాదయాత్రలో ఉదయం 11 కిలోమీటర్లు నడిచి వయనాడ్ పార్లమెంటరీ నియోజక వర్గంలోకి ప్రవేశిస్తాం" అని ఆయన ట్వీట్ చేశారు. వాండూర్‌లోని నడువత్ నుండి సాయంత్రం 5 గంటలకు పాదయాత్ర తిరిగి ప్రారంభమై మలప్పురంలోని నిలంబూర్ టౌన్ బస్ స్టేషన్ వద్ద ఆగుతుంది.
రాహుల్ వాయనాడ్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో యాత్ర మరింత ఉత్సాహంగా ముందుకుసాగనుందని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నారు. సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ప్రారంభమైన ఈ యాత్ర 3,570 కిలోమీటర్లు, 150 రోజుల పాటు సుదీర్ఘంగా సాగనుంది.