సమాజ్‌వాదీ పార్టీ అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సంతాపం తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హిందీలో చేసిన ట్వీట్‌లో.. యాదవ్‌ను సాధారణ నేపథ్యం నుండి ప్రముఖ స్థాయికి ఎదిగిన నాయకుడిగా అభివర్ణించారు. మాజీ రక్షణ మంత్రిని అసాధారణ సామర్థ్యాలు కలిగిన నాయకుడని, ఆయన మృతి దేశానికి తీరని లోటు అని ఆమె అన్నారు.
ములాయం సింగ్ యాదవ్ మరణం తనను బాధించిందని, సోషలిస్టు నాయకుడితో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తు చేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ. "మేము ఆయా రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా పనిచేసినప్పుడు ములాయం సింగ్ యాదవ్ జీతో నేను చాలా సంప్రదింపులు జరిపాను. ఆయనతో తన సాన్నిహిత్యం కొనసాగింది. ఆయన అభిప్రాయాలను వినడానికి నేను ఎప్పుడూ ఎదురుచూస్తాను. ఆయన మరణం నన్ను బాధిస్తోంది. ఆయన కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం. శాంతి'' అని ట్వీట్ చేశారు.
బీహార్ మాజీ సీఎం, కేంద్ర మాజీ మంత్రి, ఆర్జేడీ వ్యవస్థాపకుడు లాలూ ప్రసాద్ యాదవ్ స్పందిస్తూ.. ములాయం జ్ఞాపకాలు తనతో ఎప్పుడూ ఉంటాయన్నారు. ''యూపీ మాజీ ముఖ్యమంత్రి, సామాజిక నేత ములాయం సింగ్ యాదవ్ మరణ వార్త తెలిసింది. ఆయన ఆత్మకు దేవుడు తన పాదాల వద్ద చోటు ఇవ్వాలి. ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులకు మనోధైర్యాన్ని ఇవ్వాలి'' అంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ములాయం మరణం తీరని నష్టమని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు.
సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, యూపీ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ కు మూడుసార్లు ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా పనిచేసిన ములాయం తన జీవితకాలం పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసమే పని చేశారని కొనియాడారు. ములాయం కుమారుడు అఖిలేష్ యాదవ్, వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.