ముంబై చేరుకున్న సీఎం కేసీఆర్‌

CM KCR reaches Mumbai to meet Uddhav Thackeray. తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ముంబై చేరుకున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి

By Medi Samrat  Published on  20 Feb 2022 8:21 AM GMT
ముంబై చేరుకున్న సీఎం కేసీఆర్‌

తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ముంబై చేరుకున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రేతో కేసీఆర్ భేటీ కానున్నారు. మలబార్‌ హిల్స్‌లోని ఉద్ధవ్‌ ఠాక్రే నివాసం 'వర్ష'లో ఇరువురు సమావేశం కానున్నారు. బిజెపికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు ఏకం కావాలని భావిస్తున్న త‌రుణంలో సీఎం కేసీఆర్‌.. ఉద్ధవ్ థాకరేను కలవనున్నారు. ఈ భేటీ అనంత‌రం కేసీఆర్‌ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) అధినేత శరద్ పవార్‌తో ఆయన నివాసంలో సమావేశం కానున్నారు.

సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ఉదయం 11 గంటలకు ప్రత్యేక విమానంలో ముంబైకి బయలుదేరారు. ఆయన వెంట మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ కవిత, ఎంపీలు బీబీ పాటిల్, రంజిత్ రెడ్డి, సంతోష్ కుమార్, రైతు బంధు సమితి చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి శ్రవణ్ కుమార్ రెడ్డి ఉన్నారు.

ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మహారాష్ట్ర ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లే మార్గంలో పలువురు టీఆర్‌ఎస్, శివసేన మద్దతుదారులు చంద్రశేఖర్ రావును ముంబైకి స్వాగతిస్తూ హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. ముంబైలోని రోడ్లపై 'దేశ్ కి నేత కేసీఆర్' అనే సందేశంతో కూడిన హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. చంద్రశేఖర్ రావు, ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్‌లను "తమ ప్రజల గర్వం, ఆత్మగౌరవం కోసం నిలబడిన" నాయకులుగా పేర్కొంటూ "ఇప్పుడు దేశం యొక్క గర్వం, ఆత్మగౌరవం కోసం కలిసి నిలబడిన నాయకులు" అని ప్రత్యేక ఫ్లెక్సీ బ్యానర్‌లు ఏర్పాటు చేశారు.


Next Story