ఢిల్లీలో ఎగిరిన గులాబీ జెండా.. బీఆర్ఎస్ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

CM KCR inaugurated BRS party office in national capital Delhi. దేశ రాజకీయాల్లో మరో కీలక ఘట్టానికి తెరలేచింది. దేశంలో గుణాత్మక మార్పు కోసం నడుంబిగించిన

By అంజి  Published on  14 Dec 2022 1:15 PM IST
ఢిల్లీలో ఎగిరిన గులాబీ జెండా..  బీఆర్ఎస్ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

దేశ రాజకీయాల్లో మరో కీలక ఘట్టానికి తెరలేచింది. దేశంలో గుణాత్మక మార్పు కోసం నడుంబిగించిన తెలంగాణ సీఎం, భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) చీఫ్‌ కేసీఆర్‌.. బుధవారం ఢిల్లీలో పార్టీ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించారు. దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి పేరును ఇటీవలే భారత రాష్ట్ర సమితిగా మార్చారు. దీనికి ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని సర్దార్‌ పటేల్‌ రోడ్డులో బీఆర్‌ఎస్‌ పార్టీ జాతీయ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. మధ్యాహ్నం 12:37 గంటలకు పార్టీ జెండాను ఆవిష్కంచారు. ఈ సంద‌ర్భంగా కేసీఆర్‌కు జాతీయ, రాష్ట్ర నాయ‌కులు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ కార్యక్రమానికి జేడీఎస్‌ నేత కుమారస్వామి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత, యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌యాదవ్‌తోపాటు దేశం నలుమూలల నుంచి ప్రముఖ రాజకీయ నాయకులు హాజరయ్యారు.

ఇవాళ మధ్నాహ్నం 12 గంటలకు పార్టీ కార్యాలయానికి కేసీఆర్‌ చేరుకున్నారు. అక్కడ నిర్వహిస్తున్న రాజశ్యామల యాగం పూర్ణాహుతిలో పాల్గొన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయ ఆవరణలో వేదపండితులు ఫణిశశాంక శర్మ, గోపీకృష్ణ శర్మలతోపాటు వాస్తు నిపుణులు సుద్దాల సుధాకర తేజ తదితరులు యాగ క్రతువులో పాల్గొన్నారు. మంగళవారం నాడు గణపతి పూజతో యాగం మొదలు అయ్యింది. పూర్ణాహుతి అనంతరం పార్టీ జెండాను సీఎం కేసీఆర్‌ ఆవిష్కరించారు. అనంతరం వేదపండితుల ఆశీర్వచనాలు తీసుకొని తన కార్యాలయంలో కుర్చీలో కూర్చున్నారు. పార్టీకి సంబంధించిన పత్రాలపై సంతకం చేశారు.

ప్రారంభోత్సవంలో పెద్ద ఎత్తున పాల్గొన్న నాయకులు, శ్రేణులు

బీఆర్ఎస్ పార్టీ కార్యాల‌యం ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో స‌మాజ్‌వాదీ పార్టీ అధినేత‌, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాద‌వ్, జేడీఎస్ అధినేత‌, క‌ర్ణాట‌క మాజీ సీఎం కుమార‌స్వామి, తమిళనాడుకు చెందిన విడుతలై చిరుతైగల్‌ కచ్చి పార్టీ ఎంపీ చిదంబరం, పలు రాష్ట్రాల రైతు సంఘం నాయకుల‌తో పాటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇత‌ర నాయ‌కులు పాల్గొన్నారు. పార్టీ జాతీయ కార్యాలయం ప్రారంభోత్సవంలో బీఆర్‌ఎస్‌ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్‌పర్సన్లు, జడ్పీ, మున్సిపల్‌ చైర్‌పర్సన్లు, డీసీఎంఎస్‌, డీసీసీబీ చైర్‌పర్సన్లు, సామాన్య కార్యకర్తలు అనేకమంది ఢిల్లీలోని బీఆర్‌ఎస్‌ కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.

మరో ఐదు నెలల్లో కొత్త కార్యాలయం

బీఆర్‌ఎస్‌ కోసం ఢిల్లీలోని వసంత్‌ విహార్‌లో సొంత భవనం నిర్మిస్తున్నారు. మరో ఐదు నెలల్లో ఇది రెడీ కానుంది. నిన్న ఢిల్లీలోని వసంత్‌ విహార్‌లో నిర్మాణంలో ఉన్న బీఆర్‌ఎస్‌ నూతన కార్యాలయాన్ని సీఎం కేసీఆర్‌ సందర్శించారు. నిర్మాణ పనుల తీరును అడిగి తెలుసుకొన్నారు. భవనానికి సంబంధించిన కొలతలను సీఎం దగ్గర ఉండి చేయించారు. గదులు, హాలు, పార్కింగ్‌, ప్రధాన ద్వారం తదితర వాటికి సంబంధించి పలు సూచనలు చేశారు. మరో 5-6 నెలల్లో నూతన భవన నిర్మాణ పనులు పూర్తి అవుతాయని పనులు చేస్తున్నవారు వివరించారు.





Next Story