మాతృభాష‌లో చ‌దివితే ఉద్యోగాలు రావు అనేది అపోహ మాత్ర‌మే : జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ

CJI NV Ramana participated in Meet and Greet in New Jersey.మాతృభాషలో చదివితే ఉద్యోగాలు రావనేది అపోహ మాత్రమేనని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Jun 2022 9:22 AM IST
మాతృభాష‌లో చ‌దివితే ఉద్యోగాలు రావు అనేది అపోహ మాత్ర‌మే : జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ

మాతృభాషలో చదివితే ఉద్యోగాలు రావనేది అపోహ మాత్రమేనని, మాతృభాషలోనే చదివి తాను ఈ స్థాయికి వ‌చ్చిన‌ట్లు సుప్రీం కోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ అన్నారు. అమెరికాలోని న్యూజెర్సీలో తెలుగు కమ్యూనిటీ ఆఫ్‌ నార్త్‌ అమెరికా ఆధ్వర్యంలో జరిగిన మీట్‌ అంట్‌ గ్రీట్‌ కార్యక్రమంలో సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ దంప‌తులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా జస్టిస్‌ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. మాతృభాష, మాతృభూమిలో ఉన్న ప్రేమను ఆస్వాదించాలన్నారు. మన భాషతో పాటు పరాయి భాషనూ గౌరవిస్తున్నామని తెలిపారు.

మాతృభూమిని, సొంత మనుషులను వదులుకుని, ఆచార వ్యవహారాలకు పెద్ద పీట వేస్తూ జీవితాన్ని గడుపుతున్న మీ నిబద్ధతను చూస్తుంటే తెలుగు జాతి భవిష్యత్తు సురక్షితమన్న భావన కలుగుతోందన్నారు. మా తెలుగు తల్లికి మల్లెపూల దండతో కార్యక్రమం ప్రారంభ‌మైంద‌ని, తెలుగుతల్లి ముద్దు బిడ్డలుగా ఉన్న మిమ్మల్ని కలవడం సంతోషంగా ఉందని అన్నారు. అమెరికాలో దాదాపు 7 లక్షల మంది తెలుగువారు ఉన్నారని, ఎన్నో ద‌శ‌ల్లో అనేక ప‌రీక్ష‌లు ఎదుర్కొని వారు ముందుకు సాగుతున్నార‌న్నారు. తెలుగు ప్రజల్లో తాను ఒకడిగా ఉండటాన్ని గర్విస్తున్నానని చెప్పారు. పుట్టిన ఊరు, మట్టివాసన, మట్టి గుబాళింపును నెమరువేసుకోవాలని ఎన్‌ఆర్‌ఐలకు సూచించారు.

రైతు కుటుంబం నుంచి వచ్చిన తాను సీజేఐ స్థాయికి ఎదిగానని జస్టిస్‌ ఎన్వీ రమణ తెలిపారు. మాతృభాషలో చదివితే ఉద్యోగాలు రావనేది అపోహ మాత్రమేనని అన్నారు. తాను లా మాత్రమే ఇంగ్లిష్‌ మీడియంలో చదివాన‌ని అన్నారు. జాషువా, దాశథి, శ్రీశ్రీ వంటి మహానుభావులు వెలకట్టలేని సంపద ఇచ్చారని చెప్పారు. రాష్ట్రపతిని లేదా చిన్న ఉద్యోగిని కలిసినా తన ప్రవర్తనలో మార్పు ఉందని అన్నారు.

Next Story