పోక్సో కేసులో మాజీ సీఎంను మూడు గంటల పాటు ప్రశ్నించిన సీఐడీ
పోక్సో కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడ్యూరప్ప సోమవారం సీఐడీ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు.
By Medi Samrat Published on 17 Jun 2024 2:59 PM GMTపోక్సో కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడ్యూరప్ప సోమవారం సీఐడీ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. కేసుకు సంబంధించిన వాస్తవాలను ఆయన నుంచి తెలుసుకునేందుకు సీఐడీ ప్రయత్నిస్తుంది. ఈ వ్యవహారంలో యడ్యూరప్పను సీఐడీ ఎస్పీ సారా ఫాతిమా విచారించినట్లు తెలుస్తోంది.
పోక్సో కేసుకు సంబంధించి క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సీఐడీ) యడియూరప్పను సోమవారం మూడు గంటలపాటు ప్రశ్నించింది. ఆయనను మూడు గంటల పాటు విచారించామని సీఐడీ అధికారి ఒకరు తెలిపారు.
విచారణకు హాజరయ్యే ముందు బీఎస్ యడ్యూరప్ప మాట్లాడుతూ.. నేను ఇప్పుడు సీఐడీ వద్దకు వెళ్తున్నాను. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. తనపై కుట్రలకు పాల్పడే వారికి ప్రజలు గుణపాఠం చెబుతారు" అని అన్నారు. రాష్ట్ర ప్రజలు ఇప్పటికే అనేక సమస్యలతో సతమతమవుతున్నారని అన్నారు. ద్రవ్యోల్బణంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నేరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
తన మైనర్ కుమార్తెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ బాధితురాలి తల్లి 2024 మార్చి 3న సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. యడ్యూరప్ప తన కుమార్తెను లైంగికంగా వేధించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం కేసు దర్యాప్తును సీఐడీకి అప్పగించింది.
ఈ ఫిర్యాదుపై విచారణకు హాజరు కావాలని సీఐడీ అధికారులు యడ్యూరప్పకు రెండుసార్లు నోటీసులు ఇచ్చినా విచారణకు హాజరుకాలేదు. దీంతో యడ్యూరప్పపై అరెస్ట్ వారెంట్ జారీ చేయాలని కోరుతూ సీఐడీ అధికారులు నగరంలోని మొదటి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న కోర్టు యడ్యూరప్పపై నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
తనపై నమోదైన ఫిర్యాదుతో పాటు పోక్సో ప్రత్యేక న్యాయస్థానం విచారణను రద్దు చేయాలని, ముందస్తు బెయిల్‌ను కోరుతూ యడ్యూరప్ప హైకోర్టులో ప్రత్యేక పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పను అరెస్టు చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది.