మహిళా ముఖ్యమంత్రి ఉన్నచోటే ఇలాంటి ఘటనా.. రాజకీయం చేయడం కరెక్ట్ కాదు

కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్‌పై జరిగిన దారుణమైన అత్యాచారం, హత్యపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మౌనంగా ఉండడం.. సమస్యను రాజకీయం చేయడంపై కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ తీవ్ర విమర్శలు చేశారు.

By Medi Samrat  Published on  16 Aug 2024 8:30 PM IST
మహిళా ముఖ్యమంత్రి ఉన్నచోటే ఇలాంటి ఘటనా.. రాజకీయం చేయడం కరెక్ట్ కాదు

కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్‌పై జరిగిన దారుణమైన అత్యాచారం, హత్యపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మౌనంగా ఉండడం.. సమస్యను రాజకీయం చేయడంపై కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ తీవ్ర విమర్శలు చేశారు. మహిళా ముఖ్యమంత్రి ఉన్నచోటే ఇలాంటి ఘటన జరగడం నాకు ఆశ్చర్యం కలిగిస్తోందని అన్నారు. ఏ నాగరిక సమాజంలోనైనా ఇటువంటి సంఘటనలు ఆమోదయోగ్యం కాదు.. ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇలాంటి సమస్యలను రాజకీయం చేయడం షాకింగ్ గా ఉందన్నారు. బుధవారం అర్థరాత్రి వేల సంఖ్యలో సంఘ వ్యతిరేకులు సంఘటనా స్థలానికి చేరుకుని విధ్వంసానికి పాల్పడడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఇది కుట్రలో భాగమా? ఇది సాక్ష్యాలను నాశనం చేయడానికి, ఎవరినైనా రక్షించడానికి లేదా ఎవరినైనా ఇరికించడానికి చేసిన ప్రయత్నమా? అనే విషయంపై సమగ్ర విచారణ అవసరమన్నారు.

హత్యాచార ఘటన విషయంలో సొంతపార్టీపైనే విమర్శలు చేసిన శంతను సేన్ పదవిని తొలగించారు. పార్టీ అధికార ప్రతినిధి పదవి నుంచి ఆయనను అధిష్ఠానం తప్పించింది. పదవి నుంచి తనను తప్పించిన అనంతరం సేన్ మాట్లాడుతూ వైద్యురాలిపై అఘాయిత్యానికి పాల్పడిన వారిపైన, అలాగే ఆసుపత్రిని ధ్వంసం చేసిన వారిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి, వృత్తిరీత్యా వైద్యుడైన శంతను సేన్ మాట్లాడుతూ మూడేళ్లుగా ఆర్జీ కర్ ఆసుపత్రి ప్రిన్సిపాల్‌పై ఫిర్యాదులు వస్తున్నట్టు తెలిపారు. ఆరోగ్యశాఖలో వాస్తవంగా ఏం జరుగుతున్నదనే విషయాన్ని కొందరు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం లేదన్నారు. తాను ఆ స్టేట్‌మెంట్‌ను అధికార ప్రతినిధిగానే ఇచ్చానని తెలిపారు. తాను పార్టీకి కానీ, ఏ నాయకుడికీ వ్యతిరేకంగా కానీ మాట్లాడలేదని స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని అన్నారు.

Next Story