ఎమ్మెల్యే వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు.. మహిళల దుస్తుల వల్లే అత్యాచారాలు పెరిగిపోతున్నాయ్‌..!

Children in College should be fully clothed says Karnataka MLA Renukacharya.క‌ర్ణాట‌క రాష్ట్రాన్ని హిజాబ్ వివాదం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Feb 2022 2:47 PM IST
ఎమ్మెల్యే వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు.. మహిళల దుస్తుల వల్లే అత్యాచారాలు పెరిగిపోతున్నాయ్‌..!

క‌ర్ణాట‌క రాష్ట్రాన్ని హిజాబ్ వివాదం కుదిపేస్తోంది. రాష్ట్రంలోని కొన్ని క‌ళాశాలల్లో ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధ‌రించి త‌ర‌గ‌తుల‌కు హాజ‌రుకావ‌డంపై జ‌నవ‌రి చివ‌రి వారంలో ప్రారంభ‌మైన వివాదం చినికి చినికి గాలి వాన‌లా మారింది. మంగ‌ళ‌వారం ఉడుపి, మాండ్య త‌దిత‌ర జిల్లాల్లో విద్యార్థి వ‌ర్గాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌లు నెల‌కొన్నాయి. ఈ నేప‌థ్యంలో స్పందించిన రాష్ట్ర ప్ర‌భుత్వం స్కూల్స్‌, కాలేజీల‌కు మూడు రోజులు సెలవులు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

కాగా.. హిజాబ్ వివాదంపై ప‌లువురు రాజ‌కీయ నాయ‌కులు సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే కాంగ్రెస్ నాయ‌కురాలు ప్రియాంక గాంధీ చేసిన ట్వీట్‌పై స్పందిస్తూ.. క‌ర్ణాట‌క బీజేపీ ఎమ్మెల్యే రేణుకాచార్య వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ప్రియాంక గాంధీ 'బికినీ' ట్వీట్‌ను ప్ర‌స్తావిస్తూ.. మ‌హిళ‌లు వేసుకునే దుస్తుల వ‌ల్ల‌నే అత్యాచారాలు పెరుగుతున్నాయ‌ని అన్నారు.

'ప్రియాంక గాంధీ బికీని ట్వీట్ దిగ‌జారుడు ప్ర‌క‌ట‌న‌. కాలేజీలో చ‌దివే పిల్ల‌లు త‌మ శ‌రీరాన్ని పూర్తిగా క‌ప్పేలా దుస్తులు ధ‌రించాలి. మ‌హిళ‌ల దుస్తులు పురుషుల‌ను రెచ్చ‌గొట్టేలా ఉన్నాయి. మ‌హిళ‌ల బ‌ట్ట‌ల కార‌ణంగానే ఈ రోజుల్లో లైంగిక దాడుల ఘ‌ట‌న‌లు పెరుగుతున్నాయి. మ‌హిళ‌లు బ‌ట్ట‌ల‌ను నిండుగా ధ‌రించాలి. మ‌న దేశంలో మ‌గువ‌ల‌కు గౌర‌వం ఉంది.' అని ఆయ‌న ట్వీట్ చేశారు. ఆయ‌న చేసిన ఈ ట్వీట్ పై ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో పెద్ద చ‌ర్చే న‌డుస్తోంది.

హిజాబ్ వివాదంపై అంత‌క‌ముందు ప్రియాంక గాంధీ స్పందించారు. తాము ఎలాంటి దుస్తులు ధరించుకోవాలో నిర్ణయించుకోవడం మహిళల హక్కు అని, ఆ హక్కుకు భారత రాజ్యంగం హామీ ఇస్తోందని అన్నారు. బికినీ వేసుకోవాలా, చీరకొంగుతో ముసుగు వేసుకోవాలా, జీన్స్ ధరించాలా అనేది ఆమె ఇష్టాన్ని బట్టే ఉంటుందన్నారు. వస్త్రధారణ పేరుతో మహిళలను వేధించడం ఆపాలని ట్వీట్ చేశారు. 'లడ్‌కీహూ లడ్‌సక్‌తీ హూ' అంటూ హ్యాష్‌ట్యాగ్ ను జోడించారు.

Next Story