క్షీణించిన ఛోటా రాజన్ ఆరోగ్యం

ఢిల్లీలోని తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్ ఆరోగ్యం శుక్రవారం ఒక్కసారిగా క్షీణించింది.

By Medi Samrat  Published on  10 Jan 2025 4:13 PM IST
క్షీణించిన ఛోటా రాజన్ ఆరోగ్యం

ఫైల్ ఫోటో..

ఢిల్లీలోని తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్ ఆరోగ్యం శుక్రవారం ఒక్కసారిగా క్షీణించింది. దీంతో ఆయ‌న‌ ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరారు. అక్కడ వైద్యులు ఆయ‌న‌ను పరీక్షిస్తున్నారు. ఛోటా రాజన్ సైనస్ సమస్యతో బాధపడుతున్నట్లు తీహార్ జైలు పరిపాలన వర్గాలు తెలిపాయి. ఆయ‌న‌ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు.. దాని కారణంగా ఆయ‌న‌ ఆరోగ్యం క్షీణించింది. ఢిల్లీ ఎయిమ్స్‌లో వైద్యులు ఆయనకు వైద్య పరీక్షలు చేస్తున్నారని తెలిపారు. ఈ సమస్య కారణంగా ఛోటా రాజన్‌కు ఆపరేషన్‌ చేయాల్సి ఉంటుందని వైద్యులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు తీహార్ జైలు పరిపాలన విభాగం, ఢిల్లీ ఎయిమ్స్ యాజమాన్యం ఆపరేషన్‌పై ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

గత కొన్ని రోజులుగా ఛోటా రాజన్ ఆరోగ్యం విషమంగా ఉందని తీహార్ జైలు వర్గాలు తెలిపాయి. జైలు వైద్యులు అతనికి చికిత్స అందించారు. ఇంతకు ముందు కూడా ఛోటా రాజన్ ఆరోగ్యం చాలాసార్లు క్షీణించింది. దీంతో జైలు యంత్రాంగం అత్యంత అప్రమత్తంగా వ్యవహరించింది. శుక్రవారం ఛోటా రాజన్ ఆరోగ్యం బాగా క్షీణించడంతో, చికిత్స కోసం ఢిల్లీ ఎయిమ్స్‌లో చేర్చాలని నిర్ణయించారు. దీని తరువాత ఆయ‌న‌ను ఎయిమ్స్‌కు తీసుకువచ్చారు. అక్కడ పరీక్షల తర్వాత ఆయ‌న‌ సైనస్ సమస్యకు శస్త్రచికిత్స చేయనున్నట్లు వైద్యుల బృందం తెలిపింది. అయితే ఈ ఆపరేషన్ ఎప్పుడు చేస్తారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.

ఛోటా రాజన్‌ను ఢిల్లీ ఎయిమ్స్‌లో చేర్చిన తర్వాత ఢిల్లీ పోలీసులు అక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. దావూద్ ఇబ్రహీం అనుచరులు చోటా రాజన్‌పై దాడి చేసే అవకాశం ఉంది. దీంతో ఢిల్లీ పోలీసులు పూర్తిగా అప్రమత్తమయ్యారు.

ఛోటా రాజన్ ఒకప్పుడు కరుడుగట్టిన డాన్ దావూద్ ఇబ్రహీంకు అత్యంత సన్నిహితుడు. దావూద్ ఇబ్రహీంలాగా ముంబై అండర్ వరల్డ్ లో ఛోటా రాజన్ పేరు కూడా మారుమోగింది. అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత ముంబైలో జరిగిన అల్లర్ల తర్వాత ఇద్దరూ విడిపోయారు. దీని తర్వాత 1993లో ముంబై బాంబు పేలుడు తర్వాత, వారిద్దరూ ఒకరికొకరు బద్ధ శత్రువులుగా మారారు. దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్‌కు పారిపోగా, ఛోటా రాజన్ ఇండోనేషియాలో ఉంటూ తన ముఠాను నడపడం ప్రారంభించాడు. ఛోటా రాజన్ అసలు పేరు రాజేంద్ర సదాశివ్ నికల్జే. 2015లో ఇండోనేషియాలోని బాలిలో ఆయ‌న‌ను అరెస్టు చేసి భారత్‌కు తీసుకొచ్చారు. ఆ తర్వాత పలు కేసుల్లో ఆయ‌న‌ శిక్ష అనుభవిస్తున్నాడు.

Next Story