ఓ కానిస్టేబుల్‌కి రోడ్డుపై రూ.45లక్షలు దొరికాయి.. అతను ఏం చేశాడంటే
Chhattisgarh traffic cop deposits unclaimed bag containing Rs 45 lakh at police station.ఇటీవల మానవసంబంధాలు
By తోట వంశీ కుమార్
ఇటీవల మానవసంబంధాలు మంటగలిసిపోతున్నాయి. డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తున్నారు కొందరు. డబ్బు చుట్టే లోకం తిరుగుతోంది. కాసుల కక్కుర్తితో మోసాలు, హత్యలు చేసున్నారు. అందరూ అలా ఉండరని నిరూపించాడు ఓ కానిస్టేబుల్. తనకు రోడ్డుపై దొరికిన రూ.45లక్షల రూపాయలను అప్పగించి నిజాయతీని చాటుకున్నాడు. ఈ ఘటన చత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని రాయ్‌పూర్‌లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. నిలాంబర్ సిన్హా అనే వ్యక్తి రాయ్‌పూర్‌లో ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. శనివారం ఉదయం అతడు విమానాశ్రయం సమీపంలోని రహదారిపై డ్యూటీ చేస్తున్నాడు. కొంత సమయం తరువాత.. అల్పాహారం చేయడానికి విమానాశ్రయం నుండి క్యాంప్‌కు వెలుతున్నాడు. ఇంతలో.. ఒక వ్యక్తి కనిపించాడు అతను రాయ్ పబ్లిక్ స్కూల్ ఎదురుగా ఉన్న రహదారిలో ఓ బ్యాగు పడి ఉందని నీలాంబర్ కు చెప్పాడు. నీలాంబర్ అక్కడికి వెళ్లే సరికి ఆ బ్యాగ్ పక్కన ఆటో డ్రైవర్ నిలబడి ఉన్నాడు. అతను బ్యాగ్‌లోంచి ఏదో తీసేందుకు ప్రయత్నిస్తున్నాడు కానీ నీలాంబర్‌ని చూసి పారిపోయాడు.
నీలాంబర్ బ్యాగ్ దగ్గరకు చేరుకుని చూడగా బ్యాగ్ లోపల 2000, 500 నోట్ల కట్టలు కనిపించాయి. వెంటనే నీలాంబర్ ఉన్నతాధికారులకు సమాచారం అందించాడు. బ్యాగ్‌ని పోలీస్ కంట్రోల్ రూంకు తీసుకొచ్చాడు. అక్కడ నగదును లెక్కించగా రూ.45లక్షలు ఉన్నట్లు గుర్తించారు. బ్యాగ్ దగ్గర నిలబడి ఉన్న ఆటో డ్రైవర్ అందులోని ఒక కట్టను దొంగిలించాడని, అతని కోసం పోలీసులు వెతుకుతున్నారని నీలాంబర్ చెప్పాడు. నీలాంబర్ నిజాయతీకి మెచ్చిన ఉన్నతాధికారులు రివార్డును ప్రకటించారు. ఆ బ్యాగు పోగొట్టుకుంది ఎవరో తెలుసుకునే పనిలో ఉన్నారు.