ఏడు గంటల్లో 101 మంది మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు

Chhattisgarh Orders Probe After Surgeon Operates On 101 Women In 7 Hours. ఏడు గంటల్లో 101 మంది మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు

By M.S.R  Published on  4 Sep 2021 11:16 AM GMT
ఏడు గంటల్లో 101 మంది మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు

ఏడు గంటల్లో 101 మంది మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసిన ఘటనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతూ ఉంది. అంతేకాకుండా ఈ పనికి పాల్పడ్డ వారిపై విమర్శలు రావడంతో దర్యాప్తు కోసం కమిటీని ఏర్పాటు చేశారు. ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయపూర్‌కు 300 కిలోమీటర్ల దూరంలోని సుర్గుజా జిల్లా మెయిన్‌పట్ డెవలప్‌మెంట్ బ్లాక్‌, నర్మదాపూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆగస్టు 27న మెగా స్టెరిలైజేషన్ క్యాంప్ నిర్వహించారు. నిబంధనల ప్రకారం రోజుకు 30 కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయాల్సి ఉండగా.. క్యాంప్‌లో మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు 101 మంది మహిళలకు ట్యూబెక్టమీ ఆపరేషన్లు నిర్వహించారు. అంత తక్కువ సమయంలో అన్ని ఆపరేషన్స్ ఎలా చేశారు అంటూ వైద్యులపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో సర్గుజా చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ పీఎస్ సిసోడియా స్పందించారు.

క్యాంపులో ఆపరేషన్లు చేసిన సర్జికల్ స్పెషలిస్ట్ డాక్టర్ జిబ్నస్ ఎక్కా, బ్లాక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆర్‌ఎస్ సింగ్‌లకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఈ అంశంపై దర్యాప్తు కోసం ముగ్గురు సభ్యుల కమిటీని కూడా ఏర్పాటు చేశారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ కోసం ఏర్పాటు చేసిన శిబిరానికి పెద్ద సంఖ్యలో మహిళలు హాజరయ్యారని సర్జరీలు చేసిన వైద్యులు తెలిపారు. వారంతా సుదూర గ్రామాల నుండి వచ్చారని, తరచూ ప్రయాణించలేరని చెప్పుకొచ్చారు. ఆపరేషన్లు చేయమని మహిళలు కోరడంతో తాము చేసినట్లు వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. 2014 నవంబర్‌లో బిలాస్‌పూర్‌ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన స్టెరిలైజేషన్ క్యాంప్‌లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయించుకున్న 83 మంది మహిళలు అనారోగ్యం పాలయ్యారు. వీరిలో 13 మంది మరణించారు. అయితే ఈసారి అధికారులు అప్రమత్తమయ్యారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ను చేయించుకున్న మహిళల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు అధికారులు కనిపెట్టుకున్నారు.


Next Story
Share it