కునో నేషనల్ పార్క్‌లో మరో చిరుత మృతి

Cheetah Suraj Died In Kuno National Park Of Sheopur. మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో శుక్రవారం మరో మగ చిరుత మృతి చెందింది. చనిపోయిన చిరుత పేరు సూరజ్‌గా చెబుతున్నారు.

By Medi Samrat  Published on  14 July 2023 4:42 PM IST
కునో నేషనల్ పార్క్‌లో మరో చిరుత మృతి

మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో శుక్రవారం మరో మగ చిరుత మృతి చెందింది. చనిపోయిన చిరుత పేరు సూరజ్‌గా చెబుతున్నారు. సూరజ్ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. వైద్యు బృందం విచారణలో నిమగ్నమై ఉందని వెల్ల‌డించారు. గత నాలుగు నెలల్లో కునో నేషనల్ పార్క్‌లో ఇది 8వ చిరుత మరణం. వాటిలో ఐదు పెద్ద చిరుత‌లు ఉండ‌గా.. మూడు పిల్ల చిరుత‌లు ఉన్నాయి.

అటవీశాఖ అధికారులు జూన్ 25న దక్షిణాఫ్రికాకు చెందిన సూరజ్‌ను ఒక పెద్ద ఎన్‌క్లోజర్ నుండి అడవిలోకి వ‌దిలారు. అయితే శుక్రవారం అడవిలో శవమై కనిపించింది. ఈ విషయం అటవీశాఖ అధికారులకు తెలియడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. మృతి చెందిన మగ చిరుత సూరజ్‌కు పోస్టుమార్టం నిర్వహిస్తున్నామని.. ఆ తర్వాత దాని మరణానికి కారణం ఏమిటో తేలిపోతుందని అధికారులు వెల్ల‌డించారు.

అభయారణ్యంలో మొత్తం ఐదు పెద్ద చిరుతలు, మూడు చిరుతలు చనిపోయాయి. అయితే వెంట‌వెంట‌నే చిరుత‌లు ఎందుకు చనిపోతున్నాయో.. దీని వెనుక కారణం ఏంటనేది ఇప్పటి వరకు అసలు వెల్లడి కాలేదు. దీనిపై అటవీశాఖ అధికారులు వివ‌ర‌ణ ఇవ్వ‌డానికి నిరాకరిస్తున్నారు. తాజాగా.. మంగళవారం కునో అభయారణ్యంలో తేజస్ అనే మగ చిరుత మృతి చెందింది. ఆడ చిరుతపులితో పోరాటంలో తేజస్ చ‌నిపోయింద‌ని పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది.

17 సెప్టెంబర్ 2022న ప్రధాని మోదీ నమీబియా నుండి తీసుకొచ్చిన‌ ఎనిమిది చిరుతలను కునో నేషనల్ పార్క్‌లో విడుదల చేశారు. నమీబియా నుంచి ఎనిమిది, దక్షిణాఫ్రికా నుంచి 12 చిరుతలను తీసుకొచ్చారు. పార్కులో ఆడ చిరుత మూడు పిల్లలకు జన్మనిచ్చింది. వీటిలో పిల్లలన్నీ చనిపోయాయి. వాటితో పాటు ఐదు పెద్ద చిరుతలు చనిపోయాయి.దీంతో కునో నేషనల్ పార్క్‌లో 15 చిరుతలు మిగిలి ఉన్నాయి. సూరజ్ పోస్టుమార్టం రిపోర్టు వచ్చాక అతడు ఎలా చనిపోయాడన్న విషయం తేలనుంది.


Next Story