ఛార్‌ధామ్ యాత్రకు వేళాయె..!

ఛార్‌ధామ్ యాత్రకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది.

By Medi Samrat  Published on  27 Feb 2025 6:15 PM IST
ఛార్‌ధామ్ యాత్రకు వేళాయె..!

ఛార్‌ధామ్ యాత్రకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది. ఏప్రిల్ 30 నుంచి ఛార్‌ధామ్ యాత్ర మొదలవ్వనుంది. మహాశివరాత్రి సందర్భంగా ఓంకారేశ్వర్ ఆలయంలోని కేదార్‌నాథుడికి పూజల అనంతరం అధికారులు ఛార్‌ధామ్ యాత్ర తేదీలను నిర్ణయించారు. బద్రీనాథ్- కేదార్‌నాథ్ ఆలయ కమిటీ సీఈఓ విజయ్ ప్రసాద్ తప్లియాల్ మాట్లాడుతూ ఏప్రిల్ 30న అక్షయ తృతీయ రోజున యమునోత్రి, గంగోత్రి ఆలయాలు తెరుచుకోనున్నాయని, మే 2న కేదార్‌నాథ్‌ ఆలయం, మే 4న బద్రీనాథ్ ఆలయాల తలుపులు తెరవనున్నట్లు తెలిపారు. హిమాలయాల్లోని ఉండే ఈ ఆలయాలు ఆరు నెలల మాత్రమే తెరిచి ఉంటాయి. 2024, నవంబరు 3న కేదార్‌నాథ్ ఆలయాన్ని మూసివేశారు.

యాత్రకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ త్వరలోనే మొదలవ్వనుంది. గతేడాది ఈ యాత్రకు 46 లక్షల మందికి పైగా వెళ్లారు. రిజిస్ట్రేషన్ ఆన్‌లైన్‌లో 60 శాతం, ఆఫ్‌లైన్‌లో 40 శాతం నమోదు చేయనున్నారు. యాత్ర ప్రారంభమయ్యే 10 రోజుల ముందు ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ మొదలవుతుంది. మార్చి 11 నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. యాత్ర మార్గాన్ని చిన్న సెక్టార్‌లుగా విభజించి ప్రతి 10 కిలో మీటర్లకు పోలీసు పోస్టులు ఏర్పాటు చేశారు.

Next Story