చంద్రునిపై భారతదేశం యొక్క తదుపరి దశ అయిన చంద్రయాన్ -3 ఆగస్టు 2022 లో షెడ్యూల్ చేయడంతో పాటు, అంతరిక్ష శాఖ ఈ సంవత్సరం 19 మిషన్లను ప్లాన్ చేసిందని ప్రభుత్వం లోక్‌సభకు తెలిపింది. "చంద్రయాన్-2 నుండి నేర్చుకున్న అంశాలు, జాతీయ స్థాయి నిపుణుల సూచనల ఆధారంగా, చంద్రయాన్-3 యొక్క సాక్షాత్కారం పురోగతిలో ఉంది. అనేక సంబంధిత హార్డ్‌వేర్, వాటి ప్రత్యేక పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాయి. ప్రయోగాన్ని ఆగస్టు 2022లో షెడ్యూల్ చేయబడింది" అని కేంద్ర అంతరిక్ష మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఒక వ్రాతపూర్వక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
2022 జనవరి నుండి డిసెంబరు వరకు మొత్తం 19 మిషన్లు ప్లాన్ చేయబడ్డాయి. ఇందులో ఎనిమిది 'లాంచ్ వెహికల్ మిషన్లు', ఏడు 'స్పేస్‌క్రాఫ్ట్ మిషన్లు', నాలుగు 'టెక్నాలజీ డెమాన్‌స్ట్రేటర్ మిషన్లు' ఉన్నాయని జితేంద్ర సింగ్ చెప్పారు. కోవిడ్-19 మహమ్మారి కారణంగా కొనసాగుతున్న అనేక మిషన్లు ప్రభావితమయ్యాయి. అలాగే స్పేస్ సెక్టార్ సంస్కరణలు, కొత్తగా ప్రవేశపెట్టిన డిమాండ్ ఆధారిత నమూనాల నేపథ్యంలో ప్రాజెక్ట్‌ల పునఃప్రాధాన్యత కూడా జరిగిందని ఆయన చెప్పారు. కోవిడ్ మహమ్మారి నుండి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న ఇస్రో.. ప్రయోగాలు చేసేందుకు సన్నద్ధం అవుతోంది.