ఫొటోలు తీసి పంపిన చంద్రయాన్-3.. కక్ష్య తగ్గింపు ప్రక్రియ సక్సెస్

చంద్రయాన్‌ -3 తన లక్ష్యానికి మరింత దగ్గరగా చేరింది. చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించిన ఒక రోజు తర్వాత కక్ష్య తగ్గింపు విన్యాసాన్ని విజయవంతంగా నిర్వహించినట్టు ఇస్రో తెలిపింది.

By అంజి  Published on  7 Aug 2023 5:04 AM GMT
chandrayaan 3, moon, orbit changing, isro

వీడియో తీసి పంపిన చంద్రయాన్-3.. కక్ష్య తగ్గింపు ప్రక్రియ సక్సెస్

చంద్రయాన్‌ -3 తన లక్ష్యానికి మరింత దగ్గరగా చేరింది. చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించిన ఒక రోజు తర్వాత భారతదేశ మూడవ చంద్రుని మిషన్‌ చంద్రయాన్‌-3 కక్ష్య తగ్గింపు విన్యాసాన్ని విజయవంతంగా నిర్వహించినట్టు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఆదివారం నాడు తెలిపింది. దీంతో చంద్రయాన్ - 3 మిషన్ ఇప్పుడు చంద్రుని చెంతకు చేరుకొని చందమామ చుట్టూ తిరిగే పనిని ప్రారంభించింది. చంద్రునికి 170 కిలోమీటర్లు సమీపం నుండి 4313 కిలోమీటర్లు దూరపు కక్ష లో తిరిగి మొదటి రౌండ్ ను పూర్తి చేసింది. ఇలా మరో ఐదు సార్లు తిరిగిన తరువాత చంద్రుని పైకి ల్యాండ్ కావడం జరుగుతుంది. ఆదివారం చంద్రయాన్-3 మిషన్ చంద్రుని చుట్టూ తిరిగే సమయలో అందులోని కెమెరాలు రికార్డు చేసిన 45 సెకండ్ల అద్భుతమైన వీడియోను ఇస్రో విడుదల చేసింది. ఈ వీడియో ద్వారా మనకు చంద్రుని సమీపంలో నుండి చూసిన అనుభూతి కలుగుతుంది.

ఆదివారం రాత్రి ఇస్రో శాస్త్రవేత్తలు వ్యోమనౌక‌లోని ఇంజిన్‌ను మండించి కక్ష్య తగ్గింపును చేపట్టారు. దీంతో చంద్రయాన్-3 చంద్రుడికి మరింత దగ్గరైంది. ఆగస్టు 9వ తేదీన మధ్యాహ్నం 1.00 నుంచి 2.00 మధ్య చంద్రయాన్-3 చంద్రునికి మరింతగా దగ్గర అయ్యేలా మరో చిన్న కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఆ తరువాత మరో రెండు సార్లు కక్ష్య మార్పు కార్యక్రమం ఉంటుందని ఇస్రో వెల్లడించింది. చివర్లో చంద్రుడికి 100 కిలోమీటర్ల ఎత్తున ఉన్న దీర్ఘవృత్తాకార కక్ష్యలోకి చంద్రయాన్-3ని చేర్చుతారు. ఆ తర్వాత ఈ నెల 23న చంద్రుడిపై దించుతారు. ల్యాండర్‌, రోవర్‌తో కూడిన ల్యాండింగ్‌ మాడ్యుల్‌ ప్రొపల్షన్‌ మాడ్యుల్‌ నుండి విడిపోతుంది. చంద్రయాన్-3 వ్యోమనౌకను గత నెల శ్రీహరికోట నుంచి ప్రయోగించిన విషయం తెలిసిందే. తొలుత భూమి చుట్టూ పరిభ్రమిస్తూ వేగం పుంజుకున్న వ్యోమనౌక శనివారం చంద్రుని కక్ష్యలోకి తొలిసారిగా ప్రవేశించింది.

Next Story