కేంద్ర వార్షిక బడ్జెట్ 2025-26 ప్రజలకు ఉపయోగకరమైన, ప్రగతిశీల బడ్జెట్ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో వికసిత్ భారత్ విజన్ ను ప్రతిబింబించేలా ఈ బడ్జెట్ ఉందని అభిప్రాయపడ్డారు. మహిళా సంక్షేమం, పేదలు, యువత, రైతులకు ఈ బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇచ్చారని చంద్రబాబు ట్వీట్ చేశారు. దేశ సంక్షేమం దిశగా ఈ బడ్జెట్ ద్వారా కీలక ముందడుగు వేశారని, ఈ బడ్జెట్ మన దేశానికి సుసంపన్నమైన భవిష్యత్ ను అందించేలా సమగ్రమైన, కచ్చితమైన బ్లూప్రింట్‌గా నిలుస్తుందని అన్నారు. ఈ బడ్జెట్ ద్వారా మన ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అనదగ్గ మధ్య తరగతి ప్రజలకు పన్ను ఊరట కల్పించారని చంద్రబాబు చెప్పారు.
కేంద్ర బడ్జెట్ లో ఏపీకి పలు కేటాయింపులు చేశారు. పోలవరం ప్రాజెక్టు, విశాఖ స్టీల్ కి ప్రాధాన్యతనిచ్చారు. పోలవరం ప్రాజెక్టుకు రూ. 5,936 కోట్లు కేటాయించారు. పోలవరం ప్రాజెక్ట్ కు బ్యాలెన్స్ గ్రాంట్ 12,157 కోట్ల రూపాయలు ఇస్తున్నట్లు తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు రూ. 3,295 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలో రోడ్లు, వంతెనల నిర్మాణానికి రూ. 240 కోట్లు, ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి రూ. 162 కోట్లు కేటాయించారు.