'మన్ కీ బాత్'లో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. ఈ సందర్భంగా చండీగఢ్ విమానాశ్రయానికి షహీద్ భగత్ సింగ్ పేరు మార్చాలని కేంద్రం నిర్ణయాన్ని ప్రకటించారు. "గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడికి నివాళిగా, చండీగఢ్ విమానాశ్రయానికి ఇప్పుడు షహీద్ భగత్ సింగ్ పేరు పెట్టాలని నిర్ణయించారు" అని ఆయన చెప్పారు. సెప్టెంబర్ 28న ఆయన జయంతి నేపథ్యంలో.. ఆ స్వాతంత్ర్య సమరయోధుడికి నివాళిగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
సెప్టెంబరు 28న షహీద్ భగత్ సింగ్ పుట్టినరోజుకు ముందు మొహాలీ-చండీగఢ్ విమానాశ్రయానికి పేరు పెట్టాలని తాను, హర్యానా పౌర విమానయాన శాఖ మంత్రి దుష్యంత్ చౌతాలా పరస్పరం ఏవియేషన్ మంత్రిత్వ శాఖకు లేఖ పంపినట్లు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తెలిపారు. ''పీఎం మోదీ 'మన్ కీ బాత్'లో ఈ విషయాన్ని ప్రకటించారు. ఎయిర్‌పోర్టు పేరు మార్చినందుకు, నేను అతనికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను'' అని పంజాబ్ సీఎం అన్నారు.
ప్రధాని మోదీ ఇంకా మాట్లాడుతూ.. నమీబియా నుండి ఇటీవల ఎనిమిది చిరుతలను తీసుకొచ్చి వన్యప్రాణుల అభయారణ్యంలో విడిచిపెట్టిన విషయం గురించి మాట్లాడారు. దశాబ్దాల తర్వాత చీతాలు తిరిగి భారత్లో అడుగుపెట్టడం 130 కోట్ల భారతీయులకు గర్వకారణమని, ప్రస్తుతం చీతాలు టాస్క్ఫోర్స్ పర్యవేక్షణలో ఉన్నాయని చెప్పారు. త్వరలోనే చీతాలను చూసేందుకు ప్రజలకు అనుమతిస్తామని చెప్పారు. అలాగే చీతాలకు కొత్త పేర్లు సూచించాలని ప్రజలను కోరారు. అలాగే జంతువుల పట్ల మనుషులు ఎలా ప్రవర్తించాలనే విషయంపైనా సూచనలు ఇవ్వాలని కోరారు.
భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. "దీనదయాళ్ అద్భుతమైన మానవతావాది, ఆలోచనాపరుడు, భరతమాత ముద్దుబిడ్డ" అని గుర్తు చేసుకున్నారు. వాతావరణ మార్పులతో సముద్ర పర్యావరణ వ్యవస్థలు దెబ్బతింటున్నాయని ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సవాళ్లను పరిష్కరించడానికి మనమంతా కృషిచేయాలని విజ్ఞప్తి చేశారు. అక్టోబర్ 2న బాపు జయంతి సందర్భంగా 'వోకల్ ఫర్ లోకల్' ప్రచారాన్ని మరింత ఉధృతం చేయాలన్నారు.