కరోనా మహమ్మారి ముప్పు ఇంకా తొలగిపోక ముందే డెంగీ కలవరపెడుతోంది. దేశ వ్యాప్తంగా డెంగీ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం డెంగీ తీవ్రత ఎక్కువగా ఉన్న తొమ్మిది రాష్ట్రాలకు ఆరోగ్య శాఖ ప్రత్యేక బృందాలను పంపించింది. డెంగీ నివారణకు సాంకేతిక సాయం అందించడంతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయా రాష్ట్రాలకు ఈ బృందాలు సూచనలు చేయనున్నాయి. ఈ జాబితాలో తమిళనాడు, ఉత్తరప్రదేశ్, కేరళ, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్ ఉన్నాయి.
డెంగీ పరిస్థితులపై ఎప్పటికప్పుడు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూఖ్ మాండవీయ సమీక్షా సమావేశాలు నిర్వహించారు. డెంగీ కేసులు అధికంగా ఉన్న రాష్ట్రాలను ఇప్పటికే గుర్తించారు. ఆయా ఆయా రాష్ట్రాకు ప్రత్యేక బృందాలను పంపాలని నిర్ణయించారు. కేంద్రం ఆదేశాలతో బుధవారం ఆయా ఆయా రాష్ట్రాలకు మెడికల్ టీమ్‌లు వెళ్లాయి. డెంగీపై అవగాహన కార్యక్రమాల నిర్వహణతో పాటు వేగంగా వ్యాధి నిర్థారణ పరీక్షలు జరిపేలా చర్యలు తీసుకోవాలని ఆయా ఆయా రాష్ట్రాలకు మెడికల్ టీమ్‌లు సూచించనున్నారు.
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో 1,16,991 డెంగీ కేసులు నమోదైనట్లు కేంద్రం వెల్లడించింది. ఒక్క ఢిల్లీలోనే ఈ ఏడాది 1530 కేసులు వెలుగుచూశాయి. వీటిలో అక్టోబర్ నెలలోనే 1200 కేసులు వచ్చాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.