విమానాలకు బెదిరింపులు.. 'ఎక్స్'ను మందలించిన కేంద్రం..!
గత కొన్ని రోజులుగా వివిధ విమానయాన సంస్థల విమానాలకు బెదిరింపులు వచ్చాయి.
By Medi Samrat Published on 23 Oct 2024 11:50 AM GMTగత కొన్ని రోజులుగా వివిధ విమానయాన సంస్థల విమానాలకు బెదిరింపులు వచ్చాయి. బెదిరింపుల నేపథ్యంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ ఈరోజు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X ని మందలించింది. జాయింట్ సెక్రటరీ సంకేత్ ఎస్ భోంద్వే ఈరోజు ఎయిర్‌లైన్స్, ఎక్స్, మెటా వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ప్రతినిధులతో వర్చువల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ నేరాలను ఎక్స్ ప్రోత్సహిస్తున్నట్లుగా పరిస్థితి తయారైందని అన్నారు. ఇలాంటి ప్రమాదకరమైన వదంతులు వ్యాప్తి చెందకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నారని ఆయన ఈ వేదికల ప్రతినిధులను ప్రశ్నించారు.
గత కొద్ది రోజుల్లో 120కి పైగా ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. నిన్న కూడా ఇండిగో, విస్తారా, ఎయిర్ ఇండియాకు చెందిన 30 విమానాలకు బెదిరింపులు వచ్చాయి.
ప్రయాణికుల భద్రత విషయంలో రాజీ పడకుండా సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఇలాంటి తప్పుడు బెదిరింపులకు పాల్పడే వారిపై నో ఫ్లై లిస్టులో పెట్టడంతోపాటు కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
పౌర విమానయాన భద్రతకు వ్యతిరేకంగా చట్టవిరుద్ధమైన చర్యలకు వ్యతిరేకంగా చట్టాలను కఠినతరం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం, విమానయాన భద్రతా నిబంధనలు ప్రధానంగా విమాన సమయంలో జరిగే నేరాలను కవర్ చేస్తాయి.
చట్ట సవరణకు ప్రయత్నిస్తున్నామని, న్యాయవాద బృందం పని చేసిందని మంత్రి తెలిపారు. ఇతర మంత్రిత్వ శాఖలతో కూడా సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉందని.. చట్టంలో కూడా మార్పులు చేసేందుకు కచ్చితంగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు. బెదిరింపుల వెనుక ఏదైనా కుట్ర ఉందా అని ప్రశ్నించగా, సమగ్ర విచారణ జరుగుతోందని, ప్రతిదీ వెల్లడిస్తానని మంత్రి చెప్పారు.