'ఆ పాటలు ప్రసారం చేయొద్దు'.. రేడియో ఛానెళ్లకు కేంద్రం హెచ్చరిక

Centre directs FM radio channels not to play songs glorifying drugs. డ్రగ్స్, మద్యం, ఆయుధాలు, గ్యాంగ్‌స్టర్‌ తుపాకీ సంస్కృతిని కీర్తిస్తూ పాటలు ప్లే చేయొద్దని

By అంజి  Published on  2 Dec 2022 10:52 AM IST
ఆ పాటలు ప్రసారం చేయొద్దు.. రేడియో ఛానెళ్లకు కేంద్రం హెచ్చరిక

డ్రగ్స్, మద్యం, ఆయుధాలు, గ్యాంగ్‌స్టర్‌ తుపాకీ సంస్కృతిని కీర్తిస్తూ పాటలు ప్లే చేయొద్దని, అలాంటి కంటెంట్‌ను ప్రసారం చేయకూడదని ఎఫ్‌ఎం రేడియో ఛానెల్‌లను హెచ్చరిస్తూ కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఒక సలహా జారీ చేసింది. సలహాను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాంటి పాటలు, విషయాలను ప్రసారం చేయడం ఆలిండియా రేడియో ప్రోగ్రామ్ కోడ్‌ను ఉల్లంఘించడమేనని పేర్కొంది.

కొన్ని ఎఫ్‌ఎం రేడియో ఛానెల్‌లు మద్యం, డ్రగ్స్, ఆయుధాలు, గ్యాంగ్‌స్టర్లు, తుపాకీ సంస్కృతిని కీర్తిస్తూ పాటలు ప్లే చేస్తున్నాయని మంత్రిత్వ శాఖకు తెలిసింది. ఇలాంటి పాటలు, కంటెంట్ యువతను ప్రభావితం చేస్తుందని, గ్యాంగ్‌స్టర్ల సంస్కృతికి దారితీస్తుందని అభిప్రాయపడింది. ఒక వేళ పాటలు ప్లే చేసినట్లు తెలిస్తే ఆ ఛానెళ్ల అనుమతిని నిలిపివేయడం, ప్రసార నిషేధంపై పరిమితులు విధించే హక్కు కేంద్ర ప్రభుత్వానికి ఉందని మంత్రిత్వ శాఖ నొక్కి చెప్పింది. సూచించిన నిబంధనలు, షరతులను ఖచ్చితంగా పాటించాలని, మద్యం, డ్రగ్స్, తుపాకీ సంస్కృతితో సహా సంఘ వ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహించే ఎలాంటి కంటెంట్‌ను ప్రసారం చేయవద్దని మంత్రిత్వ శాఖ ఛానెల్‌లను ఆదేశించింది.

ఎంజీఓపీఏ అందించే ప్రోగ్రామ్, అడ్వర్టైజ్‌మెంట్ కోడ్‌లను కచ్చితంగా అనుసరించాలని స్పష్టం చేసింది. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే శిక్షకు అర్హులు అవుతారని వార్నింగ్‌ ఇచ్చింది. మంత్రిత్వ శాఖ ప్రకారం.. పంజాబ్, హర్యానా హైకోర్టు ఇలాంటి ప్రసారాలు మైనర్‌ వయస్సు పిల్లలపై ప్రభావం చూపుతాయని న్యాయపరమైన గమనికను తీసుకుంది. అంతే కాకుండా గ్యాంగ్‌స్టర్ల సంస్కృతికి దారి తీస్తుందని పేర్కొంది. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై రెడీయో ఛానెళ్లకు వార్నింగ్‌ ఇచ్చింది.

Next Story