దేశీయ విమానయాన సంస్థ ఇండిగో సర్వీసులకు అంతరాయం కలగడంతో విపరీతంగా పెరిగిన విమాన టికెట్ల ధరలపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర పౌర విమానయాన శాఖ, విమాన ఛార్జీలపై గరిష్ఠ ధరల పరిమితి విధిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. సాధారణంగా రూ.5,000 నుంచి రూ.7,000 మధ్య ఉండే ఢిల్లీ-బెంగళూరు టికెట్ ధర ఏకంగా లక్ష రూపాయలకు చేరడంపై కేంద్రం ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.
కొత్త నిబంధనల ప్రకారం, ఎకానమీ క్లాస్ టికెట్లకు దూరాన్ని బట్టి గరిష్ఠ ధరలను ప్రభుత్వం నిర్ణయించింది. 500 కిలోమీటర్ల వరకు ప్రయాణానికి గరిష్ఠ ఛార్జీ రూ.7,500. 500 నుంచి 1,000 కిలోమీటర్ల మధ్య రూ.12,000. 1,000 నుంచి 1,500 కిలోమీటర్ల మధ్య రూ.15,000. 1,500 కిలోమీటర్లు దాటిన ప్రయాణాలకు గరిష్ఠంగా రూ.18,000గా నిర్ణయించారు.