ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై బీబీసీ ప్రసారం చేస్తున్న డాక్యుమెంటరీకి సంబంధించిన ట్వీట్లు, యూట్యూబ్ వీడియోలను బ్లాక్ చేయాలని ట్విటర్, యూట్యూబ్‌లను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ డాక్యుమెంటరీలోని మొదటి భాగానికి సంబంధించిన యూట్యూబ్ వీడియోల లింక్‌లను జత చేసి ఇచ్చిన సుమారు 50 ట్వీట్లను బ్లాక్ చేయాలని ట్విటర్‌ను కోరింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ (IT Rules), 2021 ప్రకారం కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఈ ఆదేశాలను ట్విటర్, యూట్యూబ్ లకు జారీ చేసింది. భారత ప్రభుత్వం ఆదేశాలను ఈ రెండు కంపెనీలు పాటించాయి.
బీబీసీ డాక్యుమెంటరీ ప్రజలను తప్పుదోవపట్టించే ప్రచారాస్త్రమని భారత ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ డాక్యుమెంటరీని కేంద్ర హోం, విదేశాంగ, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు పరిశీలించారు. భారత దేశ సార్వభౌమాధికారం, అఖండత, సమగ్రతలకు విఘాతం కలిగించే విధంగా ఉందని.. దీనివల్ల విదేశాలతో భారత దేశ స్నేహ సంబంధాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపింది.