'ఆపరేషన్ సింధూర్'పై కేంద్ర సమాచార శాఖ నోట్ విడుదల
గత రెండ్రోజులుగా జరుగుతున్న ఆపరేషన్ సింధూర్‌పై కేంద్ర సమాచార శాఖ నోట్ రిలీజ్ చేసింది.
By Knakam Karthik
'ఆపరేషన్ సింధూర్'పై కేంద్ర సమాచార శాఖ నోట్ విడుదల
గత రెండ్రోజులుగా జరుగుతున్న ఆపరేషన్ సింధూర్‌పై కేంద్ర సమాచార శాఖ నోట్ రిలీజ్ చేసింది. ఈ మేరకు కీలక అంశాలను ఆ నోట్‌లో పేర్కొంది. ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకున్న ఆపరేషన్ సిందూర్ అనంతరం పాకిస్థాన్ విరుచుకుపడేందుకు చేసిన ప్రయత్నాలను భారత వాయుసేన సమర్థంగా అడ్డుకుంది. జమ్మూ కశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలపై పాకిస్థాన్ నుండి ప్రయోగించిన ప్రతి క్షిపణిని భారత రక్షణ వ్యవస్థ విజయవంతంగా నిరోధించింది. ఒక్క క్షిపణీ లక్ష్యాన్ని తాకలేకపోవడం విశేషం. ఈ చర్య ద్వారా భారత్‌కు ఉన్న గగన రక్షణ సామర్థ్యం ప్రపంచానికి స్పష్టమైంది. గత పదకొండు సంవత్సరాలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత రక్షణ వ్యవస్థకు జరిగిన బలపరచడం ఫలితంగా ఇది సాధ్యమైంది. పాకిస్థాన్ రక్షణ వ్యవస్థ స్తబ్దతను కూడా ఇది బహిర్గతం చేసింది.
S-400 ట్రయుమ్ఫ్ క్షిపణి వ్యవస్థలు, బరాక్-8, ఆకాష్ క్షిపణులు, DRDO అభివృద్ధి చేసిన యాంటీ డ్రోన్ టెక్నాలజీలు సమన్వయంతో పనిచేస్తూ భారత గగనానికి అంచె దాటి రక్షణ కల్పించాయి. భారత్ కేవలం రక్షణకే పరిమితం కాకుండా, ప్రతిదాడిలో ముందడుగు వేసింది. పాక్ భూభాగంలో లోయిటరింగ్ మ్యూనిషన్స్ (ఆత్మాహుతి డ్రోన్లు) ఉపయోగించి కీలక కేంద్రాలపై దాడులు చేసింది. లాహోర్‌లో చైనా సరఫరా చేసిన HQ-9 యూనిట్‌ను ధ్వంసం చేయడమే కాక, ముఖ్యమైన రాడార్ వ్యవస్థలు కూడా నిర్జీవంగా మారాయి.
2014లో మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత నుంచి భారత్ రక్షణ రంగంలో అనేక కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది.
* రూ.35,000 కోట్ల విలువైన S-400 ట్రయుమ్ఫ్ ఒప్పందం (2018)
* బరాక్-8 క్షిపణుల కోసం ఇజ్రాయెల్‌తో రూ.20,000 కోట్ల ఒప్పందం (2017)
* DRDO అభివృద్ధి చేసిన ఆకాష్ క్షిపణులు, యాంటీ డ్రోన్ టెక్నాలజీ
* 2024లో అమలులోకి వచ్చిన మ్యాన్ పోర్టబుల్ కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్
ఇజ్రాయెల్ Harop డ్రోన్లు భారత్‌లో తయారీ అయ్యే స్థాయికి వచ్చాయి. రఫేల్ యుద్ధవిమానాల్లో ఉన్న SCALP, HAMMER క్షిపణులతో భారత్ శత్రువులపై శస్త్రచికిత్స తరహా దాడులు చేయగలగడం మరో ఘనత. ఈ పరిణామాలన్నీ కలిపి చూస్తే, భారత గగనతలపు ఇప్పుడు కేవలం రక్షితంగా ఉండడమే కాదు, దాడి సామర్థ్యం కలిగి కూడా ఉన్నదని స్పష్టమవుతోంది..అని కేంద్ర సమాచార శాఖ తన నోట్‌లో పేర్కొంది.