వచ్చే ఏడాది మార్చికల్లా నక్సలిజాన్ని పెకలించివేస్తాం..బీజాపూర్ ఎన్‌కౌంటర్‌పై అమిత్ షా రియాక్షన్

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో జరిగిన భారీ ఎన్‌ కౌంటర్‌లో 31 మంది మావోయిస్టులు మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎక్స్ వేదికగా స్పందించారు.

By Knakam Karthik  Published on  9 Feb 2025 5:44 PM IST
National News, Chhattigarh, Bijapr Encounter, Maoists, Amith Shah

వచ్చే ఏడాది మార్చికల్లా నక్సలిజాన్ని పెకలించివేస్తాం..బీజాపూర్ ఎన్‌కౌంటర్‌పై అమిత్ షా రియాక్షన్

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో జరిగిన భారీ ఎన్‌ కౌంటర్‌లో 31 మంది మావోయిస్టులు మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎక్స్ వేదికగా స్పందించారు. దేశాన్ని నక్సల్స్ రహితంగా మార్చే దిశగా భద్రతా దళాలు భారీ విజయాన్ని సాధించాయని ఆయన ఎక్స్‌లో రాసుకొచ్చారు. వచ్చే ఏడాది మార్చినాటికి నక్సలిజాన్ని పెకలించివేస్తామని ఎక్స్ వేదికగా పునరుద్ఘాటించారు.

ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాలు చేపట్టిన భారీ ఆపరేషన్‌లో 31 మంది మావోయిస్టులు హతమయ్యారు. అదే విధంగా పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. మానవత్వానికి వ్యతిరేకమైన నక్సలిజాన్ని అంతం చేసే ప్రయత్నంలో ఇద్దరు జవాన్లనూ కోల్పోయామని అమిత్ షా ట్వీట్ చేశారు. ఈ అమరవీరులకు దేశం ఎల్లప్పుడూ రుణ పడి ఉంటుందని రాసుకొచ్చారు. 2026 మార్చి 31 నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామన సంకల్పాన్ని కూడా పునరుద్ఠాటిస్తున్నానని రాసుకొచ్చారు. దేశంలోని ఏ పౌరుడు దాని కారణంగా ప్రాణాలు కోల్పోకూడదని అమిత్ షా పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా.. తాజాగా జరిగిన ఎన్ కౌంటర్‌లో మరో ఇద్దరు జవాన్లకు గాయాలు కాగా.. వారిని రాయ్ పూర్‌కు తరలించి, చికిత్స అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఛత్తీస్ గఢ్ చరిత్రలోనే రెండో భారీ ఎన్ కౌంటర్‌గా అధికారులు పేర్కొంటున్నారు.

Next Story