గర్భాశయ క్యాన్సర్ (Cervical Cancer) నివారణ దిశగా కేంద్ర ప్రభుత్వం అతిపెద్ద ముందడుగు వేసింది. దేశవ్యాప్తంగా బాలికలకు ఉచితంగా హెచ్‌పీవీ (HPV) టీకాలను అందించేందుకు రంగం సిద్ధం చేసింది. గర్భాశయ క్యాన్సర్ నివారణకు 14 ఏళ్లు పైబడిన బాలికలను లక్ష్యంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వం త్వరలో దేశవ్యాప్తంగా హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది.
ఇందులో భాగంగా గార్డసిల్ (Gardasil) అనే వ్యాక్సిన్‌ను ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల ద్వారా పూర్తిగా ఉచితంగా అందించనున్నారు. సాధారణంగా ఈ వ్యాక్సిన్ బయట మార్కెట్‌లో ఒక్కో డోసు సుమారు ₹4,000 వరకు ఉంటుంది, కానీ ప్రభుత్వం దీనిని సామాన్యులకు సైతం అందుబాటులోకి తెస్తోంది.
ఈ వ్యాక్సిన్ గర్భాశయ క్యాన్సర్‌కు ప్రధాన కారణమయ్యే హెచ్‌పీవీ వైరస్ రకాల నుంచి పటిష్టమైన రక్షణ కల్పిస్తుంది. శాస్త్రీయ నివేదికల ప్రకారం, చిన్న వయస్సులో ఇచ్చే ఒకే ఒక్క డోస్ వ్యాక్సిన్ జీవితకాలం పాటు రక్షణ ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ కార్యక్రమం పూర్తిగా స్వచ్ఛందంగా ఉంటుంది. 14 ఏళ్ల వయస్సులో ఈ టీకా ఇవ్వడం వల్ల వైరస్ సోకకముందే బాలికల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుందని అధికారులు వెల్లడించారు.